ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి ఓడిపోయిన తర్వాత అవమాన భారంతో ఈ రాజకీయాలు మనకొద్దులే అని పొలిటిక్స్‌ నుంచి తప్పుకున్న వాళ్లను ఎంతో మందిని చూశాం. అయితే 42 ఏళ్లుగా పోటీ చేస్తూ, ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయినా ఒక వ్యక్తి మాత్రం ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల ఫక్కడ్ బాబా ఎన్నికలు జరిగినప్పుడల్లా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతుంటారు. 1977లో మధుర లోక్‌సభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

అప్పటి నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. 2014 లోక్‌సభ, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిల్లో ఆయన బరిలోకి దిగారు. తాజాగా 17వ సారి మధుర నుంచి మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు.

అయితే తాను 20వ సారి బరిలోకి దిగినప్పుడు తప్పక గెలుస్తానని తన గురువు నిశ్చలానంద స్వామి ఆశీర్వదించారని బాబు తెలిపారు. గోవుల సంరక్షణే తన లక్ష్యమని, పేదల సమస్యలను పరిష్కరిస్తానని బాబా చెబుతున్నారు.