చెన్నై: మొదటి అంతస్థులో పెద్ద యెత్తున నగదు దాచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయనే కారణంతో ఐటి అధికారులు పార్లమెంటు సభ్యురాలు, డిఎంకె అధినేత స్టాలిన్ సోదరి కనిమొళి ఇంటిపై దాడులు చేశారు.  మంగళవారం సాయంత్రం టుటికోరిన్ లోని ఆమె ఇంటిలో ఐటి అధికారులు ఎన్నికల కమిషన్ అధికారులను వెంట పెట్టుకుని వచ్చి సోదాలు చేశారు. 

తమిళనాడులోని 39 లోకసభ స్థానాలకు, 18 శాసనసభా స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. టుటికోరిన్ నుంచి కనిమొళి పోటీ చేస్తున్నారు. పెద్ద యెత్తున నగదు పట్టుబడడంతో ఈసి వెల్లూరు సీటు ఎన్నికను రద్దు చేసింది. డిఎంకె అభ్యర్థి నివాసంలో ఆ నగదు పట్టుబడింది. 

 

డిఎంకె కోశాధికారి దురైమురగన్ కుమారుడు కథిర్ ఆనంద్ కు చెందిన గోడౌన్ లో ఈ నెల ఆరంభంలలో రూ.11.5 కోట్లు పట్టుబడ్డాయి. వెల్లూరు నుంచి కథిర్ ఆనంద్ పోటీ చేస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఐటి అధికారులు రూ. 500 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ధనప్రవాహం అధికంగా ఉందని భావిస్తున్నారు.  

 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి