బెంగుళూరు:  కర్ణాటక రాష్ట్రంలోని జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీ కూటమి 10 నుండి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటుందని కర్ణాటక సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు.

గురువారం నాడు కర్ణాటక రాష్ట్రంలో రెందో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజున ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని కుమారస్వామి ఓటర్లను కోరారు. 

దేశ భవిష్యత్తు కోసం మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఆయన కోరారు. గురువారం నాడు కుమారస్వామి తన ఓటుహక్కును వినియోగించుకొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

14 ఎంపీ స్థానాల్లో 10 నుండి 12 ఎంపీ స్థానాల్లో జేడీ(ఎస్) కాంగ్రెస్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.బీజేపీ విమర్శల గురించి తాను పట్టించుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఇక తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఎస్ఐఈటీ కాలేజీలో డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ గురువారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

తమిళనాడు రాష్ట్ర ప్రజలపై తనకు నమ్మకం ఉందన్నారు. ఈసీపై ఆయన విమర్శలు గుప్పించారు. మోడీ నడుపుతున్న పార్టీ మాదిరిగా ఈసీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

తుత్తుకూడి ఎంపీ స్థానం నుండి డీఎంకె అభ్యర్ధిగా పోటీ చేసిన కనిమొళి  చెన్నైలోని అల్వార్‌పేట వద్ద తన ఓటు హక్కును  వినియోగించుకొన్నారు.  విపక్షాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు.మైలాపూర్ వద్ద డీఎంకె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. అంబగజన్‌ తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ ఇంఫాల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.శివగంగ నియోజకవర్గం నుండి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హెచ్ రాజా కరైకూడి పోలింగ్ స్టేషన్‌ వద్ద  తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

కర్ణాటకలోని ఆర్ఎస్ఎస్ లీడర్ దత్తాత్రేయ హసబుల్ శేషాద్రిపురం‌లోని పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.  తుముకూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర్ తన భార్యతో కలిసి ఓటు వేశారు.

కర్ణాటక పీడబ్ల్యూడీ  మంత్రి హెచ్ డీ రేవణ్ణ హసన్‌లో ఓటు వేసే ముందు పెద్దువల్లప్పే గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హసన్ నుండి రేవణ్ణ తనయుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు.

బెంగుళూరులోని సెంట్రల్ ఎంపీ స్థానం నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓటేశారు.  పాండిచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

గురువారం నాడు అసోంలో 5, బీహార్లో 5, ఛత్తీస్‌ఘడ్‌లో 3, జమ్మూ కాశ్మీర్‌లో రెండు, కర్ణాటకలో 14,  మహరాష్ట్రలో 10, మణిపూర్‌లో 1, తమినాడులో 38, పశ్చిమ బెంగాల్‌లో 3 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.