న్యూఢిల్లీ:  రాజకీయాల్లో ఉన్న  మహిళలపై ప్రత్యర్థులు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఈ విమర్శలు ఒక్కోసారి శృతి మించిపోతుంటాయి. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో  మహిళలపై ఈ రకమైన వ్యాఖ్యలు పెరిగిపోయాయి. అయితే  ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్ధులపై చేసే విమర్శలు  హద్దు దాటితే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో మాయావతి,  జయప్రద, ప్రియాంక గాంధీలపై ప్రత్యర్థులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు కూడ వ్యక్తమైన సందర్భాలు కూడ లేకపోలేదు.

సినీ నటి జయప్రద ఇటీవలనే బీజేపీలో చేరారు.ఆమె  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే స్థానం నుండి  ఆమె సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు. ఎన్నికల ప్రచార సభల్లో జయప్రదపై ఎస్పీ నేతలు ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజం  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

జయప్రద లో దుస్తులను గురించి   ఎస్పీ నేత ఆజం ఖాన్  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆజం ఖాన్‌కు నోటీసులు కూడ జారీ చేసింది. ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం కూడ జయప్రదపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు.

హిందూ, ముస్లిం ఓట్లు మావే, అనార్కలి  అక్కర్లేదంటూ ఎన్నికల సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే పార్టీకి చెందిన ఫిరోజ్‌ఖాన్ కూడ జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రద తరచూ పార్టీలు మారడాన్ని ప్రస్తావిస్తూ ఈ ఎన్నికల సీజన్‌లో రాంపూర్‌లో సాయంత్రాలు కలర్‌‌ఫుల్‌గా ఉంటాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు గతంలో కూడ జయప్రదపై ఆజంఖాన్ నాట్యగత్తె అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇక బీఎస్పీ చీఫ్ మాయావతిపై  కూడ పలువురు పలు రకాలుగా విమర్శలు చేశారు. మాయావతి రోజు ముఖానికి ఫేషియల్ చేస్తారని... జుట్టుకు రంగేసుకొని  యువతిలా కన్పించేందుకు తాపత్రయపడుతారని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్  విమర్శలు చేశారు. 60 ఏళ్లు వచ్చినా ఆమె జుట్టు ఇంకా నల్లగా ఉండడానికి ఇదే కారణమన్నారు.

ఒక వేశ్య కూడా తనకు చెల్లించిన ప్రతి పైసాకు ప్రతిఫలాన్ని అందించి చిత్తశుద్ధి ప్రదర్శిస్తుంది......కానీ మాయావతి అలా కాదు. ఆమె పార్టీ టికెట్లు ఎవరు డబ్బులెక్కువగా ఇస్తే వారికి ఇస్తారు. ఎవరైనా టికెట్‌ కోసం కోటి రూపాయలు ఇస్తామంటే.. మరొకరొచ్చి రెండు కోట్లు ఇస్తామంటే వారికే ఇస్తారని బీజేపీ యూపీ శాఖ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇందిరాగాంధీని కూడ రామ్ మనోహర్ లోహియా మూగ బొమ్మ అంటూ విమర్శలు చేసేవారని  పాత తరం  నేతలకు గుర్తుండే ఉంటుంది. ప్రధానమంత్రిగా అయ్యే నాటికి ఇందిరా తక్కువగా మాట్లాడేవారని విమర్శలు ఉండేవన్నారు.

2014 ఎన్నికల సమయంలో ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్‌ మథుర బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై విరుచుకుపడ్డారు. ఆమె చూడ్డానికి అందంగా బొమ్మలా ఉంటుంది తప్ప ఆమెకు ఎవరూ ఓట్లెయ్యరంటూ ప్రచారం చేశారు. 

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ బాధ్యతలు చేపట్టగానే ఆమెని టార్గెట్‌ చేస్తూ బీజేపీ నాయకుడు కైలాష్‌ విజయవార్గియా కాంగ్రెస్‌ పార్టీలో సమర్థులైన నాయకులు లేక ఇలాంటి చాక్లెట్‌ ఫేస్‌లను తెస్తున్నారంటూ ప్రియాంకపై విరుచుకుపడ్డారు. 

కొద్ది రోజుల క్రితమే పీపుల్స్‌ రిపబ్లికన్‌ పార్టీ నేత జైదీప్‌ కవాడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఓ వీడియోను రూపొం దించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.  ఆమె తన భర్తల్ని మార్చినప్పుడల్లా ఆమె నుదుటిపై ఉన్న బొట్టు సైజు పెద్దదవుతూ ఉంటుంది. అలా అని నాతో ఒకరు చెప్పారని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ తరహా వ్యాఖ్యలపై మహిళ నేతలు ఫిర్యాదులు చేయాలని  మహిళ సంఘాలు కోరుతున్నాయి.  అంతేకాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని కూడ మహిళ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.