Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు దక్కని టిక్కెట్టు ఇప్పుడు: మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి ప్రత్యర్థి ఆయనే

2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఆయనకు ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం మాత్రం దక్కింది.

why revanth reddy select malkajigiri mp seat
Author
Malkajgiri, First Published Apr 8, 2019, 1:48 PM IST


హైదరాబాద్: 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఆయనకు ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం మాత్రం దక్కింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అ:భ్యర్ధిగా  పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించినా ఆయనకు అవకాశం దక్కలేదు. ఆనాడు టీడీపీలోని రంగారెడ్డి జిల్లా నేతలు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుండి పోటీ చేయాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.  

2014 ఎన్నికలకు ముందుగానే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్దం చేసుకొన్నారు. కొడంగల్‌ అసెంబ్లీ స్థానం నుండి తన సోదరుడిని బరిలోకి దింపాలని భావించారు.

మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి  పోటీ చేస్తానని ఆనాడు చంద్రబాబునాయుడు వద్ద రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెట్టాడు. అయితే అప్పటికే రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో పోటీ చేయాలని ప్లాన్ చేసుకోవడాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.

అయితే మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం రేవంత్ ప్రయత్నాన్ని ఆనాడు టీడీపీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి అప్పటి చేవేళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు.

ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షపదవిని మంచిరెడ్డి కిషన్‌ రెడ్డికి అప్పగించారు చంద్రబాబునాయుడు. ఈ సమయంలో కూడ మల్కాజిగిరి ఎంపీ సీటును తనకు ఇవ్వాలని చంద్రబాబును రేవంత్ కోరారు. అయితే రంగారెడ్డి జిల్లా నేతలు  రేవంత్ కు ఈ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు.

ఈ విషయమై అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి గొడవకు దిగారు. రంగారెడ్డి జిల్లా నేతలు సానుకూలంగా లేని కారణంగానే  మల్కాజిగిరి సీటు విషయంలో రేవంత్ రెడ్డికి నిరాశే ఎదురైంది.

చివరకు ఇదే సీటును చంద్రబాబునాయుడు మల్లారెడ్డికి కేటాయించారు. ఈ స్థానం నుండి మల్లారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. 2017 చివర్లో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు.  ప్రస్తుతం  జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి  రేవంత్ పోటీ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డికి పోటీగా  మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. గతంలో  టీడీపీలో ఉన్న సమయంలో తనకు టిక్కెట్టు రాకుండా అడ్డుపడిన మల్లారెడ్డికి చెందిన బంధువే రేవంత్‌కు  పోటీగా బరిలో నిలిచారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి కూడ దక్కింది. అల్లుడి గెలుపు కోసం మల్లారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిలు ఒకానొక సమయంలో వ్యక్తిగత విమర్శలకు కూడ దిగిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios