భోపాల్: కంప్యూటర్ బాబా తన వైఖరిని మార్చుకుని కాంగ్రెసు శిబిరంలోకి వచ్చారు. కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్ విజయం కోసం ఆయన పనిచేస్తున్నారు. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కంప్యూటర్ బాబాకు మంత్రి హోదా కల్పించారు. 

వేలాది మంది సన్యాసులతో కంప్యూటర్ బాబా మంగళవారం భోపాల్ వచ్చారు. దిగ్విజయ్ సింగ్ విజయం కోసం ఆయన సైఫియా కాలేజీ మైదానంలో హఠయోగం నిర్వహిస్తున్నారు. తాను ఇంకెంత మాత్రం బిజెపితో లేనని, దిగ్విజయ్ సింగ్ విజయం కోసం పనిచేస్తున్నానని కంప్యూటర్ బాబా చెప్పారు. 

ఐదేళ్లలో బిజెపి ప్రభుత్వం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించలేకపోయిందని, రామ మందిర నిర్మాణం జరగనప్పుడు మోడీ కూడా ఉండరని ఆయన అన్నారు. భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్ సైఫియా కాలేజీ మైదానంలో కంప్యూటర్ బాబా నిర్వహిస్తున్న పూజకు హాజరయ్యారు. 

దిగ్విజయ్ సింగ్ పై బిజెపి అభ్యర్థిగా ప్రగ్యా సింగ్ ఠాకూర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దిగ్విజయ్ సింగ్ విజయం కోసం కంప్యూటర్ బాబా 5 నుంచి 7 వేల మంది సన్యాసులు మూడు రోజుల పాటు యాగం నిర్వహించనున్నారు. ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన యాగాలతో పాటు సన్యాసులు భజనలు, కీర్తనలు కూడా నిర్వహించనున్నారు. 

కంప్యూటర్ బాబా అసలు పేరు నామ్ దేవ్ దాస్ త్యాగి. భజనలు చేస్తూ దిగ్విజయ్ సింగ్ కు ఓటేయాలని వందలాది మంది సాధువులు భోపాల్ లో ప్రచారం చేస్తారని కంప్యూటర్ బాబు చెప్పారు. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ప్రగ్యా సింగ్ ఠాకూర్ ను సాధువుగా పరిగణించలేమని ఆయన అన్నారు. 

భోపాల్ నియోజక వర్గానికి మే 12వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లేక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది.