ముంబై: మహారాష్ట్రలోని షిరూర్ పార్లమెంట్ స్థానంలో శివసేనను ఓడించేందుకు ఎన్సీపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.ఈ స్థానం నుండి  ఎన్సీపీ  అభ్యర్ధిగా మరాఠీ నటుడు అమోల్ కోలేను బరిలో దిగనున్నారు. కోలే నాలుగు రోజుల క్రితమే శివసేనను వీడి ఎన్సీపీలో చేరారు.

మరాఠా టీవీ సీరియల్‌లో  ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ పాత్రను పోషిస్తున్నాడు. షిరూర్ నుండి  శివసేన అభ్యర్ధి అథాల్‌రావ్ పాటిల్ 15 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

2014 ఎన్నికల్లో  పాటిల్‌ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  గత ఎన్నికల్లో  పాటిల్‌ను ఓడించేందుకు ఎన్సీపీ బలమైన అభ్యర్ధి కోసం ప్రయత్నాలు చేసింది. కానీ, సాధ్యం కాలేదు. ఎన్సీపీ అభ్యర్థి దేవదత్త నికం ఈ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

మరాఠా నటుడు ఎన్సీపీలో చేరడంతో ఈ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌లో నూతనోత్తేజం కలిగింది. షిరూర్ నియోజకవర్గంలో రాజకీయంగా ఎన్సీపీ ప్రయోజనమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

దేశంలోని యువతకు సరైన రాజకీయాలను ఇచ్చేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరినట్టుగా కోలే ప్రకటించారు.శరద్ పవార్ నాయకత్వాన్ని బలపర్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.