Asianet News TeluguAsianet News Telugu

హట్ సీటు: వైసీపీ, టీడీపీ ఔట్, నామా వర్సెస్ రేణుకా

ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలుగా టీడీపీ, వైసీపీలు పోటీ పడ్డాయి. ఈ ఐదేళ్లలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి

tdp, ysrcp not contesting from khammam mp segment
Author
Khammam, First Published Apr 2, 2019, 12:27 PM IST

ఖమ్మం:ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలుగా టీడీపీ, వైసీపీలు పోటీ పడ్డాయి. ఈ ఐదేళ్లలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. దీంతో ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు పోటీకే దూరంగా ఉండాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తర్వాతి స్థానంలో టీడీపీ నిలిచింది. ఈ  ఎన్నికల్లో మాత్రం  ఆ రెండు పార్టీలు పోటీకే దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు,  కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్ధి ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నారాయణ పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో సీపీఎం వైసీపీకి మద్దతు ప్రకటించింది.

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాతి స్థానంలో టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు నిలిచారు. సీపీఐ అభ్యర్ధిగా బరిలో దిగిన డాక్టర్ నారాయణకు కేవలం 1,87,702  ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుపై వైసీపీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 12,204 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

ఈ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  4,22,434 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్థిగా నామా 4,10,230 ఓట్లు  దక్కాయి. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ  పరిణామాల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ క్యాడర్ టీఆర్ఎస్‌లో చేరింది.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ వైసీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వలేదు.

గత నెల 19వ తేదీనే టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఖమ్మం ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు. ఈ స్థానం నుండి కోనేరు చిన్ని(నాగేశ్వరరావు) టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు.కానీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా  ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. దీంతో చిన్ని పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరికి టీడీపీ మద్దతిస్తోంది.

ఇక ఖమ్మం జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడ ఆ పార్టీ పోటీకి దూరంగా ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మంలో ప్రధాన ప్రత్యర్థులుగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వైసీపీ, టీడీపీ.. ఈ సారి ఏకంగా పోటీకే దూరమయ్యాయి. 

మరోవైపు గత ఎన్నికల్లో లక్షన్నరకుపైగా ఓట్లు సాధించిన సీపీఐ.. ఈ సారి పోటీ నుంచి తప్పుకొని సీపీఎంకు మద్దతు ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీల ఓటు బ్యాంకు.. ఏ పార్టీ వైపు మొగ్గుతుంది? ఎవరికి లాభం చేకూరుస్తుందనే విషయం సర్వత్రా ఆసక్తిని కల్గిస్తోంది.

2014లో వైసీపీ తరఫున గెలుపొందిన ప్రజాప్రతినిధులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు.ఎంపీ పొంగులేటి, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎ్‌స తీర్థం పుచ్చుకొన్నారు. దీంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి, అశ్వారావుపేట, ఖమ్మంలో పోటీ చేసి.. సత్తుపల్లి, అశ్వారావుపేటలో గెలుపొందింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios