నోటీ దురుసు కారణంగా ఎన్నికల సంఘం చేత మూడు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం ఎదుర్కొన్నాక కూడా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి ఆజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు మానలేదు. నిషేధం తర్వాత రాంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

తనను జాతి వ్యతిరేకిలా, ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదిలా చూస్తున్నారని... పాలకులకు అధికారం ఉంది కాబట్టి.. నన్ను బహిరంగంగా కాల్చి చంపండి అంటూ ఆజాంఖాన్ ప్రసంగించారు.

అలాగే మూడు రోజుల పాటు ఎన్నికల సంఘం నిషేధం విధించిన సమయంలో తాను ఎక్కడికి వెళ్లలేదని, ఎవరినీ కలవలేదని, ర్యాలీలు బహిరంగసభల్లో ప్రసంగించలేదన్నారు. రాంపూర్‌ను కంటోన్మెంట్‌గా మార్చారని, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆజాంఖాన్ ప్రసంగించారు.

రాంపూర్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారని, ఇక్కడ ప్రభుత్వం పాలన గాలికొదిలేసి భయాందోళనలు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. తనకు మద్ధతుగా జెండా మోసిన కుటుంబాల ఇళ్ల తాళాలు పగలగొట్టారని, ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించారని ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంపూర్‌లో జరిగిన ర్యాలీలో ఆజాంఖాన్.. బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మీకు నాకు మధ్య ఎలాంటి తేడా లేదని.. ఆమె నిజ స్వరూపం తెలుసుకునేందుకు నాకు 17 ఏళ్ల సమయం పట్టిందని.. ఆమె ఖాకీ అండర్‌వేర్ వేసుకుందున్న విషయాన్ని తాను 17 రోజుల్లోనే గ్రహించానంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జయప్రద.. ఆజాంఖాన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన మూడు రోజుల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ నిషేధం విధించింది.