వయనాడ్: వయనాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.కేరళలోని వయనాడ్ జిల్లా వ్యాలీలోని పుణ్యక్షేత్రం తిరునెల్లి దేవాలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు చేశారు. గర్భగుడిలో కొలువై ఉన్న విష్ణుభగవానుడికి రాహుల్ సాష్టాంగ నమస్కారాలు చేశారు. 

సముద్ర మట్టానికి 900 మీటర్లు అంటే 3వేల అడుగుల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుంది. తిరునెల్లిలో విష్ణువు కొలువై ఉన్నారు. స్వయంగా బ్రహ్మదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని పురాణాలు చెబుతాయి. ఈ తిరునెల్లి దేవాలయం దర్శనం నుంచి వైకుంఠానికి దారి ఉందని చెబుతారు. ఈ దేవాలయం సందర్శిస్తే మన తల రాత రాసే సమయంలో.. ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే బ్రహ్మ మారుస్తాడని భక్తుల విశ్వాసం.

గతంలో కూడా రాహుల్ గాంధీ ఈ అలయానికి రావాలని అనుకున్నారని, అయితే భద్రతా కారణాల రీత్యా రాలేదని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చెప్పారు. రాజీవ్ గాంధీ ఆస్థికలను ఇక్కడే నిమజ్జనం చేసినట్లు ఆయన తెలిపారు. 

 

ఆ తర్వాత వయనాడ్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తాను ప్రధాని నరేంద్ర మోడీలాగా కాదని, అబద్ధాలు చెప్పడానికి తాను రాలేదని అన్నారు. మీ తెలితేటల పట్ల, జ్ఞానం పట్ల, అవగాహన పట్ల తనకు గౌరవం ఉందని ఆయన చెప్పారు. 

తన సంబంధాలు నెల రెండు నెలలో ఉండవని, జీవితాంతం మీతో సంబంధం నెరపాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. మీరు ఏం చేయాలో, నేను ఏం ఆలోచిస్తున్నానో చెప్పడానికి రాజకీయ నాయకుడిగా తాను ఇక్కడికి రాలేదని, నా మన్ కీ బాత్ చెప్పడానికి రాలేదని, మీ మనస్సుల్లో, మీ ఆత్మలో ఏం ఉందో అర్థం చేసుకోవడానికి వచ్చానని ఆయన అన్నారు.