మాండ్యా: కర్ణాటకలోని మాండ్యా లోకసభ స్థానంలో నటి, అంబరీష్ సతీమణి సుమలతపై ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్నారు. జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా మాండ్యా నుంచి నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

నిఖిల్ కుమారస్వామి తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే అవకాశాలున్నాయి. లోకసభ ఎన్నికల్లో తమకు ఇతర స్టార్ కాంపైనర్ల అవసరం ఏమీ ఉండదని, తానూ తన తండ్రి హెచ్ డి దేవెగౌడ చాలునని కుమారస్వామి ఇంతకు ముందు అన్నారు. 

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో తన మనవడి తరఫున ప్రచారం చేయాలని దేవెగౌడ చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మేలుకోటె, పాండవపుర వంటి ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. 

గత మూడు రోజులుగా నిఖిల్ కోసం కుమారస్వామి, దేవెగౌడ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. కుమారస్వామితో పాటు పర్యాటక శాఖ మంత్రి సా రా మహేష్ నిఖిల్ కోసం కేఆర్ నగర్ తాలూకాలో రోడ్ షోలు నిర్వహించారు. 

మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత కోసం సినీ నటులు దర్శన్, యాష్ ప్రచారం చేశారు. వారి ప్రచార సభలకు పెద్ద యెత్తున ప్రజలు రావడం కుమారస్వామిని కలవరపెడుతోంది. మాండ్యాలో సుమలత విజయం సాధిస్తుందనే అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కుమారస్వామి ప్రతి రోజూ 10 నుంచి 12 గంటల పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.