ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వరరావు,  రేణుకా చౌదరిలు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. అయితే  నామా నాగేశ్వరరావు రెండు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తే ఈసారి మాత్రం ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన 2004, 2009 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానం నుండి నామా నాగేశ్వరరావు, రేణుకా చౌరదిలు పోటీ పడ్డారు. ఈ రెండు ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. రేణుకాచౌదరి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. 2004 ఎన్నికల్లో రేణుకా చౌదరి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపొందారు. 

2014 ఎన్నికల్లో కూడ నామా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయగా ఆయన అప్పటి వైసీపీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు.

వారం రోజుల క్రితమే నామా నాగేశ్వరరావు టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు.  గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్  అభ్యర్తుల ఓటమికి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమని భావించి ఆయన స్థానంలో నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చారు.

2009 ఎన్నికల్లో రేణుకా చౌదరిపై నామా నాగేశ్వరరావు లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరి విజయం కోసం టీడీపీ నేత కోనేరు చిన్ని(సత్యనారాయణ) శక్తియుక్తులను ధారపోస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో  ఖమ్మం అసెంబ్లీకి నామా నాగేశ్వరరావు ప్రజా కూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

అయితే ప్రస్తుతం ఖమ్మం ఎంపీ స్థానంలో నామా నాగేశ్వరరావు గెలుపు కోసం పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించడం విశేషం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్  గెలుపు కోసం పనిచేసిన ఆయన అనుచరులకు ఇది మింగుడుపడడం లేదు.

టీడీపీలో ఉన్న సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావులకు మధ్య ఆధిపత్యపోరు ఉండేది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న నామా నాగేశ్వరరావు కోసం తుమ్మల నాగేశ్వరరావు పనిచేస్తున్నారు.నామా నాగేశ్వరరావు విజయాన్ని తన భుజాలపై వేసుకొన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఎన్నికల ప్రచారంలో కూడ తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పాల్గొంటున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌‌లో చేరుతామని ప్రకటించారు. అంతేకాదు నామా నాగేశ్వరరావు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.   జలగం వెంకట్రావు కొత్తగూడెం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే ఆయన కూడ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, నామా నాగేశ్వరరావుల మధ్య టీడీపీలో ఉన్న సమయంలోనే విబేధాలు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. సండ్ర వెంకటవీరయ్య  టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.  మరోవైపు నామా నాగేశ్వరరావు కోసం సండ్ర వెంకట వీరయ్య కూడ ప్రచారం చేస్తున్నారు.

టీడీపీలో నామా నాగేశ్వరరావు అనుచరుడుగా ఉన్న సమయంలో ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు  మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.  రేణుకా చౌదరి గెలుపు కోసం మచ్చా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా విజయం సాధించిన రాములు నాయక్ ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. రాములు నాయక్ కూడ టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.