పాట్నా:జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలోని  బెగుసరాయ్‌ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్నట్లు మహా కూటమి ప్రకటించింది.

బీహార్ రాష్ట్రంలో అధికార జేడీ(యూ), బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఆర్జేడీ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే.  ఈ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందూస్థానీ అవామ్ మోర్చా(సెక్యులర్) , వికాస్‌షీల్ ఇసాన్ పార్టీలతో పాటు వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి.

కన్హయ్య కుమార్  సీపీఐ అభ్యర్ధిగా  బెగుసరాయ్‌ ఎంపీ స్థానం నుండి  పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ పాండే మంగళవారం నాడు ప్రటకించారు. మహా కూటమిలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌ఎస్పీ భేటీ కానుంది.

ఢిల్లీలోని జెఎన్‌యూ విద్యార్థి సంఘానికి కన్హయ్యకుమార్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఈ సమయంలోనే కన్హయ్య కుమార్ పై అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 29న బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి.