లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా సినీ నటి జయప్రద పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా ఆజంఖాన్ పోటీ చేస్తున్నారు.  ఈ స్థానంలో పోటీని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

గతంలో ఇదే రాంపూర్ ఎంపీ స్థానం నుండి జయప్రద సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో రాంపూర్‌లో జయప్రద గెలుపు కోసం ఆజంఖాన్ తీవ్రంగా కష్టపడ్డాడు.

కానీ, ఇదే స్థానం నుండి వీరిద్దరూ ప్రత్యర్థులుగా నిలిచారు. జయప్రద, అజంఖాన్‌లను పోలుస్తూ మాజీ ఎస్పీ నేత అమర్‌సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.రాంపూర్ సమస్యలను జయప్రద తీరుస్తారని అమర్‌సింగ్ చెప్పారు. మహిళల శక్తికి జయప్రద ఒక ఆయుధంగా ఉందన్నారు. అంతేకాదు  రాంపూర్‌ దుమ్మును కూడ జయప్రద దులిపేస్తారని  ఆయన అభిప్రాయపడ్డారు. 

మహీషాసురను అంతం చేసిన శక్తి మహిళలకు ఉందన్నారు. రాంపూర్‌లో ఉన్న రాజకీయ మహీషాసురను జయప్రద అంతం చేయనుందని అమర్ సింగ్ చెప్పుకొచ్చారు.

అమర్‌సింగ్ వ్యాఖ్యలు జయప్రద,అజంఖాన్ మధ్య పోటీ తీవ్రతను తెలుపుతోందని విశ్లేషకులు అభిప్రయాంతో ఉన్నారు.ఆజంఖాన్ ఇటీవలనే  జయప్రదపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళ కమిషన్ కూడ నోటీసులు జారీ చేసింది.ఆజంఖాన్ వ్యాఖ్యలను ఎస్పీ  నాయకత్వం సమర్ధించే ప్రయత్నం చేసుకొంది. ఈ నెల 23వ తేదీన రాంపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.