లక్నో: యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్  సతీమణి  డింపుల్ యాదవ్  బీఎస్పీ చీఫ్  మాయావతి కాళ్లకు మొక్కారు.ఉత్తర్‌ప్రదేశ్  రాష్ట్రంలోని కన్నౌజ్ ఎంపీ స్థానం నుండి  అఖిలేష్ యాదవ్  సతీమణి డింపుల్ మరోసారి పోటీకి దిగుతున్నారు. 

గురువారం నాడు కన్నౌజ్ లో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార సభలో  బీఎస్పీ చీఫ్ మాయావతితో పాటు  డింపుల్  కూడ పాల్గొన్నారు. ఎన్నికల వేదికపైనే డింపుల్ మాయావతి కాళ్లకు దండం పెట్టారు. వెంటనే మాయావతి డింపుల్‌ను తాను కోడలుగా పిలుస్తానని  ప్రకటించారు.

వారం రోజుల క్రితం మొయిన్‌పురిలో నిర్వహించిన ఎన్నికల సభలో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ బీఎస్పీ చీఫ్ మాయావతిని ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల సభలో డింపుల్ మాయావతి కాళ్లకు దండం పెట్టారు. తమ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

తన కాళ్లకు దండం పెట్టిన డింపుల్‌ను మాయావతి ఆశీర్వదించారు. తమ కూటమి తరపున కన్నౌజ్ నుండి ఎస్పీ అభ్యర్ధిగా బరిలో ఉన్న డింపుల్‌ భారీ మెజారిటీతో విజయం సాధించేందుకు వీలుగా కార్యకర్తలు కృషి చేయాలని మాయావతి పిలుపునిచ్చారు.

ఈ రెండు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభల్లో  కన్నౌజ్ సభ ఏడవది. క్షేత్రస్థాయిలో కూటమిని బలోపేతం చేసేందుకుగాను ఉమ్మడి సభలను ఏర్పాటు చేస్తున్నారు.

తాను డింపుల్‌ను మనస్పూర్తిగా కోడలుగా భావిస్తున్నట్టు మాయావతి చెప్పారు. అంతేకాదు ఆమె తమ కుటుంబంలో సభ్యురాలిగా చూస్తున్నట్టు మాయావతి తెలిపారు. అఖిలేష్ యాదవ్ తనకు చాలా గౌరవం ఇస్తారని మాయావతి గుర్తు చేశారు. 

తమ కుటుంబంలో ఓ పెద్దవారికి ఏ రకమైన గౌరవం ఇస్తారో తనకు అఖిలేష్ అదే రకమైన గౌరవం ఇస్తారని మాయావతి గుర్తు చేశారు. అఖిలేష్ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆమె చెప్పారు. భవిష్యత్తులో కూడ ఇదే రకమైన అనుబంధాన్ని కొనసాగిస్తామన్నారు.డింపుల్‌కు ఓటేసి గెలిపించాలని మాయావతి కోరారు. లక్షల  ఓట్ల మెజారిటీతో  డింపుల్ విజయం సాధించాలని  మాయావతి ఆకాంక్షను వ్యక్తం చేశారు.