రాంపూర్: తన ప్రత్యర్థి, రాంపూర్ ఎస్పీ లోకసభ అభ్యర్థి ఆజంఖాన్ పై బిజెపి అభ్యర్థి, సినీ నటి జయప్రద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆజం ఖాన్ దొంగ ఓట్లతోనే గెలుస్తూ వస్తున్నారని ఆమె అన్నారు. 

ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ముస్లింలు ఓట్లు వేయకుండా జిల్లా అధికార యంత్రాంగం అడ్డుకుందని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు. ఓటమి భయంతో ఆజంఖాన్ మాట్లాడారని, అందుకే ఆ విధమైన సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన దొంగ ఓట్లతోనే గెలుస్తూ వస్తున్నారని ఆమె అన్నారు. 

వారం రోజులుగా ముస్లింల ఇళ్లను లూటీ చేస్తున్నారని, వారిని కొడుతున్నారని ఆజంఖాన్ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక రోజు క్రితం జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటిండెంట్ వారిని కొట్టారని ఆయన ఆరోపించారు. 

అధికారికమైన సంతకాలు లేకుండా వారికి రెడ్ కార్డులు ఇచ్చారని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారని, వారికి ఓటు హక్కు లేకుండా చేశారని ఆయన అన్నారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తప్పుడు ఈవిఎంలను పెట్టారని ఆయన అన్నారు. రాంపూర్ లో పోలింగ్ ఏప్రిల్ 18వ తేదీన పోలింగ్ జరిగింది.