చాణక్య నీతి ప్రకారం.. భార్యాభర్తలు ఇలా ఉంటేనే అది సరైన సంసారం
చాణక్య నీతి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆచార్య చాణక్యుడు రాసిన అత్యంత ప్రభావవంతమైన నైతిక, జీవిత మార్గదర్శక సూత్రాల సమూహమే ఈ చాణక్య నీతి. ఇందులోని మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను చాణక్యుడు ప్రస్తావించారు. ఇలాంటి వాటిలో ఒకటి ఆలుమగల మధ్య బంధం. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలిద్దరు ఎలా ఉండాలన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి సమాజ నిర్మాణంలో మంచి కుటుంబాలదే పాత్ర అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసారం సజావుగా సాగితే సమాజంలో నేరాలు కూడా తగ్గుతాయని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఎన్నో రకాల నేరాలకు కుటుంబ కలహాలే కారణమని కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చెబుతున్నాయి. ఇల్లు సజావుగా సాగాలంటే ఇంట్లో ఉండే ఆలుమగల మధ్య బంధం బలంగా ఉండాలని సూచిస్తుంటారు. అయితే ఎన్నో వందల ఏళ్ల క్రితమే చాణక్యుడు ఇందుకు సంబంధించి పలు విషయాలను ప్రస్తావించారు. వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే భార్యభర్తల బంధం ఎలా ఉండాలో చాణక్య నీతిలో పేర్కొన్నారు.
వివాదాలు వచ్చినా..
ఏ ఇద్దరి మధ్య అయినా కలహాలు రావడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా భార్యభర్తల మధ్య తగాదాలు కామన్. అయితే వివాదాలు వచ్చినప్పుడు శాంతితో, నిశ్చింతంగా సమస్యను పరిష్కరించుకునే మార్గాలను అన్వేహించుకోవాలి. ఎవరో వచ్చి మన సమస్య పరిష్కరించే కంటే మనకు మనమే పరిష్కారం వెతుక్కునేందుకు ఆలోచించాలి. ముఖ్యంగా ఎవరు తగ్గాలన్న విషయంలో అస్సలు అహంకారం ప్రవర్తించకూడదు. అలాగే ఒకరి విషయంలో మరొకరు మంచి నమ్మకంతో ఉండాలి. ఏ బంధానికైనా నమ్మకమే పునాదనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
గౌరవం
వైవాహిక బంధం బలంగా ఉండాలంటే పరస్పర గౌరవం చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోకపోతే సంబంధంలో సమస్యలు రావడం తప్పదని చాణక్య నీతిలో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఇతరుల ముందు మీ భాగస్వాముల గౌరవానికి భంగం కలిగించే పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దీనివల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు తక్కువ నేను ఎక్కువనే అభిప్రాయాలకు దూరంగా ఉండాలి. తమ తమ బలాలు, బలహీనతలను అంగీకరించి.. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లాలి. అలాంటప్పుడే బంధాలు బలంగా ఉంటాయి.
ఆర్థిక విషయాల్లో
చాలా మంది ఇళ్లలో సమస్యలు, మనస్పార్థాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఆర్థికపరమైన అంశాలు కూడా ఉంటాయి. కుటుంబ ఆర్థిక వ్యవహారాలను ఆలుమగలిద్దరూ సమర్థవంతంగా నిర్వహించాలని గుర్తు పెట్టుకోవాలి. సంపాదతో పాటు పొదుపు విషయంలో కూడా ఒకరికొకరు సహకరించుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తేనే ఆ ఇల్లు నిలబడుతుంది అదే విధంగా బంధం కూడా బలపడుతుంది. ఇక ఆలుమగల మధ్య అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ప్రేమగా ఉండడం కూడా అంతే ముఖ్యమని చాణక్య నీతిలో పేర్కొన్నారు. భాగస్వామిపై మీకున్న ప్రేమను కచ్చితంగా వ్యక్తం చేసేందుకు ప్రయత్నించండి.
నమ్మకం
ఆలుమగల బంధం బలంగా ఉండాలంటే ప్రేమ, గౌరవం ఎంత ముఖ్యమో నమ్మకం కూడా అంతే ముఖ్యం. మీలోని అభద్రత భావాన్ని మీ భాగస్వామిపై రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఇది మంచిది కాదు. ఇలాంటి బిహేవియర్ వారిని ఇబ్బందికి గురి చేస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అలాగే నమ్మకాన్ని దుర్వినియోగం కూడా చేయకూడదు. మీపై ఒకరు నమ్మకంతో ఉన్నారంటే వారు మిమ్నల్ని పూర్తిగా విశ్వసిస్తున్నారని అర్థం. అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని గుర్తు పెట్టుకోవాలి.
విలువలు
భార్యబర్థలిద్దరూ విలువలతో కూడిన జీవనాన్ని సాగిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. ధర్మాన్ని పాటిస్తూ, కుటుంబ విలువలను రక్షిస్తే భవిష్యత్తలు తరాలు కూడా బాగుంటాయి. ఇంట్లో ఉండే పిల్లలు పేరెంట్స్‌ని చూసి పెరుగుతారన్న దాంట్లో పూర్తి నిజం ఉంటుంది. కాబట్టి దంపతలు బిహేవియర్ పైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.