పెళ్లికి ముందులా ప్రేమ ఎందుకు ఉండదో తెలుసా.? ఈ కారణాలతోనే..
పెళ్లికి ముందు ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వారు కూడా పెళ్లి తర్వాత గొడవలు పడుతంటారు. 'నువ్వు మారిపోయావ్.. పెళ్లికి ముందు ఎలా ఉండే వాడివి కాదు' అనే మాటలు సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. అయితే పెళ్లి తర్వాత ప్రేమ ఎందుకు మారుతుంతో ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి 4 కారణాలు చెబుతున్నారు. రిలేషన్ నిపుణులు అవేంటంటే..
'పెళ్లికి ముందులాగా పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనిపించదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది, ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది'. ఇది మజిలీ సినిమాలో నాగచైతన్య చెప్పే డైలాగ్. నిజంగానే పెళ్లికి ముందు తర్వాత ప్రేమ వ్యక్తీకరణలో మార్పులు వస్తాయి. ప్రేమ స్థానంలో బాధ్యతలు వస్తాయి. దీంతో సహజంగానే కాస్త గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే పెళ్లికి ముందు తమ భాగస్వామిని తమను ఎందుకు ప్రేమించడం లేదన్న దానికి ఐదు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అవేటో ఇప్పుడు తెలుసుకుందాం..
అంచనాలను అందుకోలేకపోవడం..
పెళ్లికి ముందు ప్రియురాలు తన ప్రియుడిని హీరోగా భావిస్తుంది. అలాగే ప్రియుడు ప్రియురాలిని హీరోయిన్‌గా ఊహించుకుంటాడు. తన ప్రియుడు తనకోసం ఏదైనా చేస్తాడన్న ఫీలింగ్‌లో ఉంటారు. ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే వివాహం తర్వాత ఆ అంచనాలను అందుకోవడంలో కొందరు విఫలమవుతుంటారు.
వైవాహిక జీవితం గురించి ఏర్పర్చుకున్న అంచనాలు అందుకోలేకపోతే ప్రేమపై విశ్వాసం తగ్గుతుంది. తమ భాగస్వామి తమ అంచనాలకు అనుగుణంగా లేరన్న భావన మొదలవుతుంది. కాలక్రమేణ ఇది బంధం బీటలు వారేందుకు దారి తీస్తుందని చెబుతున్నారు.
బాధ్యతలు పెరగడం..
ప్రేమ అనేది కేవలం ఇద్దరికి సంబంధించిన వ్యవహారం. అదే పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించినది. అలాగే పెళ్లి తర్వాత సహజంగానే ఎన్నో బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి బాధ్యతలు మొదలు భవిష్యత్తు గురించి ఆలోచించే క్రమంలో ఒత్తిడి పెరుగుతుంది. సహజంగా పెళ్లికి ముందు ఇలాంటివి ఏం ఉండదు.
ఈ ఒత్తిడిలో పడిపోతుంటారు. దీంతో తన భాగస్వామి తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది కూడా ప్రేమ తగ్గిందనే భావన కలగడానికి కారణంగా చెబుతుంటారు.
సమయం కేటాయించపోవడం..
పెళ్లికి ముందు ఒకరి కోసం ఒకరు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే పెళ్లి తర్వాత ప్రేమ స్థానంలో బాధ్యతలు వస్తాయి. దీంతో ఉద్యోగం, వ్యాపారం హడావుడిలో పడి భాగస్వామికి కేటాయించే సమయం తగ్గుతుంది. ఇది కూడా ప్రేమ తగ్గిందన్న భావన కలగడానికి కారణంగా చెబుతుంటారు.
అయితే భాగస్వామితో కచ్చితంగా సమయం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు. కాసింత సమయమైనా సరే క్వాలిటీ టైమ్‌ను స్పెండ్ చేయాలని, ఇలా చేస్తే ఆ బంధం బలంగా ఉంటుందని రిలేషన్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
నెగిటివ్ అంశాలు..
పెళ్లికి ముందు ప్రేమికుల మధ్య కేవలం సానుకూల సంభాషణలు మాత్రమే ఉంటాయి. దీంతో వారిలోని నెగిటివ్ అంశాలు పెద్దగా పట్టించుకోరు. కానీ పెళ్లి తర్వాత వ్యక్తుల్లోని వేరే కోణాలు కూడా కనిపిస్తుంటాయి. ప్రతీ మనిషిలో మంచిచెడు రెండూ ఉంటాయి. ఆ చెడు విషయాలు బంధాన్ని బలహీనంగా మారుస్తాయని రిలేషన్ నిపుణులు చెబుతున్నారు.
గమనిక: భాగస్వాముల మధ్య ఇలాంటి విషయాల్లో మనస్పార్థాలు వస్తే పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ సెషన్స్ లాంటివి అందుబాటులో ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.