ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలా మందికి కనీసం కడుపు నిండా తినడానికి కూడా సమయం ఉండటం లేదు. దీనివల్ల ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా..?
ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తినాలి. అది కూడా సమయం ప్రకారం.. ఉదయం, మధ్యాహ్నం , రాత్రి పూట.. రోజుకు మూడుసార్లు తిన్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది కూడా క్రమం తప్పకూడదు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను ఎక్కువగా చేయాలి. మధ్యాహ్నం తేలికపాటి భోజనం చేయాలి. ఇక రాత్రి పూట చాలా తక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం సకాలంలో తినకపోతే.. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవని నిపుణులు చెబుతున్నారు.
సమయానికి ఆహారం తినకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా తిండిని నిర్లక్ష్యం చేసే వారు చాలా మందే ఉన్నారు. అందులోనూ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట, ఎసిడిటీ మొదలైన వాటితో బాధపడుతున్నారు. కానీ సమయానికి తినకపోవడం వల్ల ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని మీకు తెలుసా?
ధమనిలో అడ్డంకి కారణంగా మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగపోతే పక్షవాతం బారిన పడే అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్ నుంచి సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం నుంచి ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి స్ట్రోక్ కు దారితీసే ప్రధాన కారణాలు.
జర్నల్ న్యూట్రియెంట్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సాయంత్రం భోజన సమయం స్ట్రోక్ ప్రమాదంపై ప్రభావం చూపుతుందట.
భోజన సమయం స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు మూడు గ్రూపులుగా విభజించబడ్డారు. రాత్రి 8 గంటలకు ముందు తినేవారు, క్రమరహితంగా తినేవారు, రాత్రి 8 గంటల తర్వాత తినేవారు. వీరిలో సరైన సమయానికి భోజనం చేసిన వారు కాకుండా అసమాన స్థాయిలో భోజనం చేసిన వారికే హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు కనుగొన్నారు.
పుర్రెలోని ఒక రక్తనాళం మెదడులోకి ప్రవేశించి రక్తస్రావం అయినప్పుడు ఇలా జరుగుతుంది. రాత్రి 8 గంటలకు ముందు భోజనం చేసిన వ్యక్తులకు కాకుండా.. సమయం సదర్భం లేకుండా (క్రమ రహితంగా)తినే వాళ్లకే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు తేల్చారు. అధిక బరువు ఉండేవారు కూడా దీనిబారిన పడొచ్చు.
స్ట్రోక్ లక్షణాలు.. మీ జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవడం వల్ల స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. కుటుంబ చరిత్ర ఉంటే మాత్రం దీని నుంచి తప్పించుకోలేరు.
స్ట్రోక్ యొక్క లక్షణాలు.. నవ్వలేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, చేతుల్లో బలహీనత, శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా బలహీనత లేదా తిమ్మిరి, తీవ్రమైన ఆకస్మిక తలనొప్పి, అకస్మాత్తుగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, మగత, అకస్మాత్తుగా పడిపోవడం మొదలైనవి. స్ట్రోక్ వచ్చినప్పుడు రోగికి తక్షణ వైద్యం అవసరం. ఎందుకంటే మెదడుకు ఎక్కువ సేపు ఆక్సిజన్ అందకపోతే ప్రాణాల మీదికి రావొచ్చు.
