తాజా అధ్యయనం ప్రకారం.. రోజూ 8 గంటలు లేవకుండా కూర్చుని పనిచేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆఫీస్ పనిగంటలు 9 నుంచి 8 గంటలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఈ పనులు పూర్తికావడానికి సుమారుగా 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. వీరిపై పనిభారం కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లైతే నైట్ టైం కూడా పనిచేస్తుంటారు. రోజంతా ల్యాప్ ముందు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఎంత సమయం గడిచిందో కూడా తెలియదు. కూర్చుని చేసే పనులు బాగానే ఉన్నా.. వీటి వల్ల జరిగే హాని ఇంతా అంతా కాదు.
కూర్చొని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. శరీరంలో అదనపు కొవ్వుల మూలంగా ఎన్నో వ్యాధులు సోకే అవకాశం ఉందని అందరికీ తెలుసు.. అయినా అలాగే పనిచేసే వారు చాలా మందే ఉన్నారు. కానీ పని మధ్యలో లేవకుండా అలాగే 8 గంటలు పనిచేస్తే గుండె జబ్బులు వస్తాయన్న సంగతి మీకు తెలుసా..?
Chinese Academy of Medical Science and Peking Union Medical College లో నిర్వహించిన సర్వే ప్రకారం.. ఒక వ్యక్తి ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 50 శాతం ఉంటుందని తేలింది.
11 ఏండ్ల కాలంగా కొనసాగిన ఈ సర్వేలో 21 దేశాల ప్రజలు 1,05,677 మంది రికార్డులను పరిశీలించారు. ఈ సర్వే లెక్కల ప్రకారం.. వీరిలో గుండెపోటు కేసులు 2,300 ఉండగా, 3000 కేసులు స్ట్రోక్, 700 గుండె వైఫల్యం కేసులు ఉన్నాయి. వీళ్లంతా గంటలకు గంటలు ఒకే దగ్గర కూర్చుని పనిచేసేవారు.
కాగా మరో అధ్యయనం ప్రకారం.. వ్యాయామం ఎక్కువ సేపు చేసే వారు ( వారానికి 12 గంటలు చేసేవారు) హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోయే అవకాశం 17 శాతం ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇక మరీ తక్కువగా వ్యాయామం చేసేవారు (వారానికి 12 గంటల కంటే తక్కువ) గుండె జబ్బులతో చనిపోయే అవకాశం 50 శాతం ఉంటుందట.
శారీరక వ్యాయామం లేకపోవడం, గంటలకు గంటలు కూర్చోవడం వల్ల 5.8 శాతం గుండె జబ్బులొస్తే.. 8.8 శాతం మరణాలు సంభవిస్తున్నాయట.
అందుకే ఎక్కువ సేపు కూర్చోకండి. పనిమధ్యమధ్యలో లేచి కాసేపు నడవండి. ఒత్తిడితో కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా అర్థ గంటలకు లేదా గంట గంటకు లేచి నడవండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. పోషకాహారం తినండి. లేకపోతే శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. మొత్తంలో 8 గంటలు కూర్చొని పనిచేస్తే గుండె జబ్బులొస్తాయన్న సంగతిని మర్చిపోకూడదు.
