Rotten Meat: హోటళ్లలో ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ, మటన్ వేపుడు లాగించేస్తున్నారా? ఆ మటన్ తాజాదా లేక కుళ్లిపోయినదా అనే విషయం మీకు తెలుసా? హైదరాబాద్ లో భారీ ఎత్తున కుళ్లిన మటన్ పట్టుకున్నారు పోలీసులు. దీంతో రెస్టారెంట్ కి వెళ్లి తినేవారిలో భయం మొదలైంది.
ఇంటి వంటకన్నా రెస్టారెంట్ ఫుడ్ ఇష్టపడే వారు ఎంతో మంది. ఇంట్లో వంట చేయడం మానేసి, హోటళ్లలో ఘుమఘుమలాడే బిర్యానీని తినేందుకే ఇష్టపడతారు. రెస్టారెంట్, హోటల్ బిజినెస్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. కానీ మీరు రెస్టారెంట్లో తింటున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు తింటున్న మటన్ బిర్యానీ తాజాదా లేక కుళ్లిపోయినదా అని. కుళ్లిపోయినది అయితే వాసన వస్తుంది కదా అనుకోవచ్చు. బాగా మసాలాలు దట్టించి వండితే ఆ కుళ్లు వాసన కూడా పోతుంది. హైదరాబాద్ లో ఇలా రెస్టారెంట్ లకు పంపుతున్న మటన్ నిల్వలు పట్టుకున్న పోలీసులు. ఏకంగా 300 కిలల మటన్ కుళ్లిపోయిన స్థితితో వాసన వస్తోంది. దాన్ని కూడా కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ వండేస్తున్నాయి. అంతేకాదు అక్కడే కెమికల్స్ కలిపిన అల్లం వెల్లుల్లి పేస్టును కూడా పట్టుకున్నారు. కాబట్టి మీరు బయట తినే ముందు పదిసార్లు ఆలోచించి తినండి.
కుళ్లిన మాంసంతో వంటలు
నగరంలోని హోటళ్లు, క్యాటరింగ్ సంస్థలకు ఈ కుళ్లిన మాంసం, కెమికల్స్ కలిపిన అల్లం వెల్లుల్లి పేస్టును ఒక ముఠా చాలా తక్కువ ధరకే అందిస్తోంది, ధర తక్కువ కాబట్టి హోటల్ యజమానులు కూడా తెగ కొనేస్తున్నారు. ఆ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఈ విషయాలన్నీ బయటికి వచ్చాయి. అంతే కాదు టన్నుకు పైా అల్లం వెల్లుల్లి పేస్టు కూడా అందులో ఉంది. అందులో ఎసిటిక్ యాసిడ్ కలిపి అమ్ముతున్నారు. ఆపరేషన్‌లో, ఎసిటిక్ యాసిడ్ కలిపిన టన్నుకు పైగా అల్లం-వెల్లుల్లి పేస్ట్, 300 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ అల్లం వెల్లుల్లి పేస్టును అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, దుమ్ము, ధూళి, ఈగల మధ్య తయారు చేస్తున్నారు. అక్కడే నిల్వ ఉంచుతున్నారు. ఈ పేస్ట్‌ను నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. సరఫరా చేసినప్పుడు మాత్రం అందమైన డబ్బాల్లో పెట్టి అందిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కుళ్లిన మాంసాన్ని తెప్పించి దాని నుంచి దుర్వాసన రాకుండా రసాయనాలు కలిపిన నీటిలో నానబెడుతున్నారు. ఆ తర్వాత ఈ పాత మాంసాన్ని 'తాజా మాంసం'గా నమ్మించి అమ్మేస్తున్నారు. ఇలాంటి ఆహారాన్ని తిన్న ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువ. తమకే తెలియకుండా ఈ మాంసం తిని ఎంత మంది రోగాల బారిన పడ్డారో కూడా తెలియదు.


