చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల షాంపూలు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్లీ చుండ్రు పుట్టుకు వస్తుంది. అంతేనా..తలలో చుండ్రు అధికంగా ఉండడం వల్ల దురద, ముఖం మీద మొటిమలు వస్తుంటాయి. వీటిని పోగొట్టడానికి ఏవేవో నూనెలు, షాంపూలు వాడుతుంటారు.  అయితే.. ఇవేమీ లేకుండా కేవలం  కొన్ని రకాల చిట్కాలతో సమస్యను పరిష్కరించవచ్చు అంటున్నారు నిపుణులు. అదేంటో మనమూ చూద్దామా..

గోరువెచ్చని నీటిలో కొన్ని వేపాకులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వేపాకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

యాపిల్ సిడర్ వెనిగర్‌లో కొంచెం నీరు చేర్చి బాగా కలుపాలి. షాంపూకి బదులుగా ఈ మిశ్రమాన్ని తలకు వాడాలి. దీనిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలోని క్రిములను తొలిగిస్తుంది. తరచూ ఇలా చేస్తే చుండ్రు తొలిగి దురద తగ్గుతుంది.

గోరింటాకు పొడిలో కొద్దిగా పంచదార, ఆలివ్ నూనె, నిమ్మరసం, కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా పట్టించాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే తలంతా శుభ్రంగా ఉంటుంది.

వేడి నీటిలో గులాబీ ఆకులను బాగా మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు బాధ తగ్గుతుంది.