ఉదయం లేవగానే.. కప్పు కాఫీ తాగనిదే చాలా మందికి తెల్లారదు. మరికొందరు రోజుకి మూడు, నాలుగు కప్పులు కాఫీ తాగేస్తుంటారు. ఈ కాఫీ గురించి ఇప్పటి వరకు చాలా మంది పరిశోధనలు చేశారు.  కాఫీ తాగితే మంచిదని కొన్ని పరిశోధనలలో తేలితే.. లేదు.. కాఫీ అతిగా తాగితే అనారోగ్యం అంటూ మరికొన్ని పరిశోధనలలో తేలింది. తాజాగా.. మరో పరిశోధనలలో కాఫీ తాగే వారి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని తేలింది.

చాలామందికి ముఖం, చేతులపై ఎర్రగా కందిపోవడం, పింపుల్స్ రావడం లాంటివి జరుగుతుంటాయి. వీటిని రోసేసియా అనే చర్మవ్యాధితో కూడా పోలుస్తారు. అయితే.. రోజుకి నాలుగు కప్పుల కాఫీ తాగేవారికి ఈ చర్మవ్యాధి రాదట. నిపుణులు పరిశోధన ప్రకారం.. నెలకోసారి కప్పు కాఫీ తాగేవారితో పోలిస్తే.. రోజూ రెగ్యులర్ గా కాఫీ తాగేవారిలో ఈ చర్మవ్యాధి వచ్చే అవకాశం 20శాతం తక్కువగా ఉంటుంది.

ప్రొవిడెన్స్ సిటీలోని బ్రౌన్ యూనివర్శిటీ నిపుణులు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  కాఫీలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి చర్మంపై రెడ్ నెస్ ని తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో ఇది ఎక్కువగా పనిచేస్తుందని వారు వివరించారు.