యోగా మన శరీరాన్ని శక్తివంతంగా తయారుచేస్తుంది. మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అయితే కొంతమంది యోగా గురించి కొన్ని అపోహలను నమ్ముతారు. దీనివల్లే యోగాను చేయలేకపోతుంటారు. అసలు దీనిపై ఉన్న అపోహలేంటంటే?  

యోగా మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు యోగా ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యోగాభ్యాసం మీ మొత్తం శరీరానికి, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే యోగాను ఎన్నో ఏండ్ల నుంచి చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం యోగాకు దూరంగా ఉంటారు. కారణం.. దీనిపై ఉన్న అపోహలు. ఇవి పోతేనే యోగాలో పాల్గొంటారు. అసలు యోగా గురించి ఉన్న అపోహలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యోగా చేయాలంటే శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి

యోగా చేయడానికి మీ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి శరీరం ఒకేలా ఉండదు. ముఖ్యంగా ఫ్లెక్సిబుల్ గా ఉండవు. అయితే క్రమం తప్పకుండా యోగా చేస్తే శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. యోగా బలం, సమతుల్యత, ఏకాగ్రత కలయిక. కాబట్టి యోగా చేయడానికి శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండాలనే భ్రమలో ఉండకండి. దానినుంచి బయటకు రండి.

సన్నగా ఉన్నవారు మాత్రమే యోగా చేయగలరు

దీనిలో ఇంతకూడా నిజం లేదు. నిజానికి బరువు తక్కువున్న వారు మాత్రమే యోగా సాధన చేయాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే యోగా మీ శరీర పరిమాణం, బరువుపై ఆధారపడి ఉండదు. అయితే శరీర బరువు ఎక్కువున్న వారు కొన్ని యోగాసనాలు వేయడం కష్టం. అయితే స్థూలకాయంతో బాధపడేవారు కూడా చేయగలిగే వివిధ రకాల యోగాసనాలు ఉన్నాయి. అయితే క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల క్రమంగా శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. ఆ తర్వాత అన్ని రకాల యోగాసనాలను ప్రాక్టీస్ చేయొచ్చు. 

ఆస్తమా బాధితులు యోగా చేయకూడదు

ఆస్తమాతో బాధపడేవారు యోగా చేయకూడదు అనేది పెద్ద అపోహ అంటారు ఆరోగ్య నిపుణులు. ఉబ్బసంతో బాధపడే వారు తప్పనిసరిగా యోగా సాధన చేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రాణాయామం, ధ్యానం, శ్వాస వ్యాయామాలు మొదలైనవి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీంతో వారి సమస్యలో మెరుగుదల కనిపిస్తుంది. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల ఆస్తమా రోగి మందుల మోతాదు తగ్గుతుంది. 

యువకులు మాత్రమే యోగాలో పాల్గొనాలి

యువకులు మాత్రమే యోగా చేయగలరు అనే భావన కొన్నేండ్ల నుంచి ఉంది. కానీ ఇది అపోహ మాత్రమే. యోగాభ్యాసానికి లింగం, వయస్సు, శరీర కూర్పు అవసరం లేదు. యోగాకు ధ్యానం, ఏకాగ్రత మాత్రమే అవసరం. వృద్ధులు పూర్తి శ్రద్ధతో, ఏకాగ్రతతో యోగా చేస్తే వారు దాని ప్రయోజనాలను ఖచ్చితంగా పొందుతారు. వయసు పైబడిన తర్వాత కొన్ని యోగాసనాలు వేయడం కష్టమే అయినా.. వృద్ధాప్యంలో కూడా ఆచరించగలిగే యోగాసనాలు ఎన్నో ఉన్నాయి.

మహిళలు మాత్రమే యోగా చేయగలరు

మహిళలు మాత్రమే యోగా సాధన చేయగలరనే భావనను కూడా చాలా మంది నమ్ముతారు. అయితే ఎవరూ కూడా తమను తాము ఫిట్ గా ఉంచుకోవాలని యోగా చేయరు. యోగా జెండర్ పై ఆధారపడి ఉండదు. చాలా మంది పురుషులు యోగా గురువులుగా ఉన్నారు. అందుకే ఇలాంటి అపోహలను ఎట్టి పరిస్థితిలో నమ్మకండి.