అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.  అందంగా ఉండటం అంటే తెల్లగా ఉండటం కాదన్న విషయం తెలుసుకోవాలి. చర్మం రంగు ఏదైనా.. కాంతివంతంగా ఉంటే.. వారు ఎదుటివారికి అందంగా కనపడతారు. అందుకోసం మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీములు కొని రాసుకోవాల్సిన పనిలేదు. వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో ముఖం కాంతివంతంగా మారుతుంది. అందులో పెరుగు ముందుస్థానంలో ఉంటుంది.

పెరుగు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.

కొద్దిగా పెరుగు, గుడ్డు తెల్లసొన, ఉప్పు, చక్కెర కలుపుకుని మాస్కులా ముఖానికి రాసుకుని, అరగంట తర్వాత ముఖాన్ని నీళ్లతో కడిగేసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.పెరుగులో కొద్దిగా కాఫీపొడి, తేనె కలిపి ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలు పోతాయి.