మంచి లక్షణాలు, అత్తారింటిలో చక్కగా ఇమిడిపోయేలా, కుటుంబాన్ని ప్రేమించే  అమ్మాయి మీ ఇంటికి కోడలిగా రావాలి అనుకుంటున్నారా..? అయితే.. భోపాల్ లోని బర్కతుల్లా యూనివర్శిటీని సంప్రదించండి. కోడలికి యూనివర్శిటీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? పెళ్లి కావాల్సిన అమ్మాయిలను  సంస్కారవంతమైన కోడళ్లుగా తీర్చుదిద్దామని ఆ యూనివర్శిటీ హామీ ఇస్తోంది.

మహిళా సాధికారతలో భాగంగా అమ్మాయిలను ఆదర్శవంతురాలైన కోడలిగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి భోపాల్ యూనివర్శిటీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి శ్రీకారం చుట్టనుంది. పెళ్లి అయ్యాక వధువు అత్తింట అడుగుపెట్టి అక్కడి కొత్త వాతావరణంలో ఇమిడిపోయేలా అమ్మాయిలకు శిక్షణ ఇవ్వాలనేదే మా ఉద్ధేశం అని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీసీ గుప్తా చెప్పారు.

 సమాజంపై యూనివర్శిటీలకు బాధ్యత ఉందని, కుటుంబాలు సంతోషంగా ఉండటానికి కోడళ్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వీసీ పేర్కొన్నారు. కోడళ్ల శిక్షణ కార్యక్రమాన్ని యూనివర్శిటీలోని సైకాలజీ, సోషియాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాలు చేపడుతున్నాయని వీసీ వివరించారు. శిక్షణ పొందిన అమ్మాయిలు సమాజ, వివాహ, కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకొని మంచి కోడలిగా రాణిస్తారని వీసీ పేర్కొన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి 30 మంది బాలికలను ఎంపిక చేస్తామని వీసీ చెప్పారు.