వందేళ్ల క్రితం మలేరియా ఎలా వ్యాపిస్తుందో ఎవరికి తెలియదు.. ఎవరికి నచ్చిన కథను వాళ్లు వినిపించేవారు. అయితే ఓ బ్రిటీష్ యువ డాక్టర్ మలేరియా వ్యాధి దోమకాటు వల్ల వస్తుందని ఆధారాలతో సహా నిరూపించాడు. నాటి ఆయన పరిశోధన నేడు కోట్లాదిమంది ప్రాణాలను నిలబెడుతోంది. ఆయన ఎవరో కాదు సర్ రోనాల్డ్ రాస్.. ఆ పరిశోధన జరిగిన స్థలం హైదరాబాద్‌ బేగంపేట. అంతటి చారిత్రక సంఘటనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ‘‘రాస్ భవనం’’ శిథిలావస్థకు చేరుకుంది.

పట్టించుకునే నాథుడు లేకపోవడంతో కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వీరాస్వామి అనే సామాజిక కార్యకర్త రాస్ భవనాన్ని కాపాడాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ, భారత పురావస్తు శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీహెచ్ఎంసీలను వాదులుగా చేర్చాడు. ఆయా శాఖల నిర్లక్ష్యం కారణంగా చారిత్రక సంపద శిథిలావస్థకు చేరిందని.. దానితో పాటు భవంతి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని...  భవంతి లోపల సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

నిజాం ప్రాంతంలో మలేరియా వ్యాధి ప్రబలడంతో నాటి బ్రిటీష్  ప్రభుత్వం సైనిక వైద్యుడిగా పనిచేస్తోన్న సర్ రోనాల్డ్  రాస్‌ను హైదరాబాద్‌కు పంపింది. అయితే ఏ వ్యాధి నివారణకు అయినా అసలు అది ఎలా..? దేని ద్వారా వ్యాపిస్తుందో తెలియాలి. ఆయన అనుమానం దోమల మీదకు వెళ్లింది.. ఈ క్రమంలో బేగంపేట ఎస్‌పీ రోడ్‌లోని ఓ సైనిక ఆసుపత్రిలో పరిశోధనలు సాగించారు.

దట్టమైన పొదలతో, వాటి నిండా దోమలతో పరిశోధనకు అనువుగా ఉన్న ఆ ప్రాంతంలో రాస్ దోమలను పట్టుకునేవారు. అలా చిక్కిందే ఆడ ఎనాఫిలెస్ దోమ.. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి దోమ జీర్ణాశయంలో వృద్ధి చెంది.. మనిషిని కుట్టినప్పుడు దోమ నోటిలోని లాలాజలం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి..  మలేరియా వ్యాధిని కలిగిస్తుందని కనుగొన్నాడు. ఆయన కృషికి ఫలితంగా మలేరియాకు మందు కనుగొని బలమైన చికిత్సను అందిస్తున్నారు.

ప్రపంచ వైద్య  రంగానికి ఎనలేని కృషిని చేసి.. ప్రాణాంతక మలేరియా వ్యాధిని అరికట్టిన సర్ రోనాల్డ్ రాస్‌కు 1902లో నోబెల్ పురస్కారం ప్రకటించారు. నాటి ఆయన బృందం కృషికి సాక్షిగా నిలిచి ఉన్న ఆ భవనం కట్టి 130 సంవత్సరాలు కావోస్తోంది. ఈ భవంతి నిర్వహణ కోసం బ్రిటీష్ ప్రభుత్వం, భారత పురావస్తు శాఖ నిధులు విడుదల చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ భవనాన్ని ప్రపంచ  వారసత్వ సంపదగా ప్రకటించాలని ఎప్పటి  నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.