మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మన ఆలోచనలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఎప్పుడైతే మెదడు అనారోగ్యం బారిన పడుతుందో మంచి ఆలోచనలు రావు. మీరు తినే ఆహారమే మీ మెదడులోని ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. చెడు ఆలోచనలు తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలను తినాలి. 

జీవితం బిజీగా మారిపోయింది. మానసిక ఆరోగ్యం దిగజారి పోతున్న రోజులివి. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వచ్చి ఆత్మహత్యల బారిన పడుతున్న వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. మెదడు ఆరోగ్యంగా ఉంచుకుంటే అలాంటి ఆలోచనలు రావు. ఒత్తిడి పరిస్థితుల వల్ల ప్రజలు కొన్ని విపరీత నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే మీలో వచ్చే ఆలోచనలను ప్రభావితం చేసేది మీరు తినే ఆహారమే. మీరు తినే ఆహారంలో విటమిన్ బి12 లేదా విటమిన్ డి లోపిస్తే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది మెదడును బలహీనపడేలా చేస్తుంది. ప్రతికూల ఆలోచనలు అధికంగా వచ్చేలా చేస్తుంది. చెడు ఆలోచనలతో మెదడు నిండిపోతుంది.

విటమిన్ బి12, విటమిన్ డి ఎందుకు?

మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన ఆలోచనలు కూడా ఉత్తమంగా ఉంటాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి12 ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే విటమిన్ బి12, విటమిన్ డి లోపిస్తే మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. ఆ వ్యక్తికి త్వరగా చిరాకు, నిరాశ, అలసట వచ్చేస్తాయి. ప్రతికూల ఆలోచనలు కూడా ఎక్కువ అయిపోతాయి. అందుకే విటమిన్ డి, విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవాలి. లేకుంటే మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం చాలా వరకు పెరిగిపోతుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే..

విటమిన్ బి12 లోపించినా లేదా విటమిన్ డి లోపించినా కొన్ని రకాల లక్షణాలు మీలో కనిపిస్తాయి. ఎటువంటి కారణం లేకుండా మీరు బాధగా ఉంటారు. ప్రతి క్షణం ఆందోళనగా ఉంటారు. తీవ్రంగా అలసిపోతూ కనిపిస్తారు. నిద్ర కూడా తగినంత పట్టదు. ఒకవేళ తగినంత నిద్ర పోయినా కూడా అలసటగానే అనిపిస్తుంది. మనసులో ప్రతికూల ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఏ పనిపైనా ఆసక్తి ఉండదు. ఏకాగ్రత కుదరదు. ఈ లక్షణాలు మీకు పదేపదే అనిపిస్తుంటే మీ శరీరంలో విటమిన్ బి12 లేదా విటమిన్ డి లోపించాయని అర్థం.

విటమిన్ బి12 కోసం ఏం తినాలి?

విటమిన్ బి12 కొన్ని ఆహారాల్లో అధికంగా ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి. పనీరు, పెరుగు, జున్ను వంటివి తప్పకుండా తినాలి. అలాగే ప్రతిరోజు ఒక కోడి గుడ్డు తినాలి. వారానికి రెండు మూడు సార్లు చేపలు తినాలి. చికెన్ కూడా రెండు మూడు రోజులకు ఒకసారి తినడం చాలా అవసరం. అలాగే తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని ప్రతి వారం తినేందుకు ప్రయత్నించాలి. అప్పుడు విటమిన్ లోపం రాకుండా ఉంటుంది.

విటమిన్ డి కోసం ఏం తినాలి?

విటమిన్ డి తక్కువ ఆహార పదార్థాల్లో ఉంటుంది. విటమిన్ డి కోసం మీరు సూర్యరశ్మిలో 15 నుంచి 20 నిమిషాల వరకు ఉండాలి. కొన్ని రకాల పుట్టగొడుగులు, సాల్మన్, టూనా వంటి చేపలు, గుడ్డు పచ్చసొన, పాలు, నారింజరసాలలో కూడా విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి వీటిని తరచూ తినేందుకు ప్రయత్నించండి.

ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తప్పకుండా ఉండేలా చూసుకోండి. అలాగే ప్రతి రోజు ఏదో ఒక పండు తినండి. ప్రతిరోజు పాలు తాగండి. వీటివల్ల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి శరీరానికి అందుతుంది. విటమిన్ బి12 లేదా విటమిన్ డి లోపం తీవ్రంగా ఉంటే శరీరం విపరీతమైన అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించి తగిన సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సొంత వైద్యం ఎప్పుడూ చేసుకోకండి. విటమిన్ బి12, విటమిన్ డి అనేది మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. వీటిని మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితంపై ఆసక్తిని కోల్పోయినట్టు ఆలోచనలు రావడం మొదలవుతాయి.