బాదం ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా బాదం ఉపయోగపడుతుంది. అయితే.. ఇదే బాదం.. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందట. మీరు చదివింది నిజమే.. శరీరానికి సరిపడ పోషకాలు ఇవ్వడంతోపాటు సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఒక్క బాదం మాత్రమే కాదు, కీరదోస, యాపిల్ లాంటివి కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయట.

బాదంలో విటమిన్‌-ఇ, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇతర పోషకాలు కూడా ఎక్కువే. బరువు తగ్గాలనుకునేవారు రోజుకు నాలుగైదు బాదం నానబెట్టి పొట్టు తీసి తినాలి. ఇవి నాలుగు తిన్నా... పొట్ట నిండిన భావన కలుగుతుంది. శక్తి కూడా అందుతుంది. 

డైటింగ్‌ చేసేవారు...రోజూ ఉదయం అల్పాహారంతోపాటు కీరా ముక్కలు తీసుకోవాలి. ఇందులో ఎక్కువశాతం నీరే ఉండటం వల్ల కెలొరీలు చాలా తక్కువగా అందుతాయి. తిన్నాక చాలా సేపటి వరకూ ఆకలీ వేయదు. కుదిరితే భోజనానికి ముందు ఒక కీరా తీసుకోగలిగితే అన్నం తక్కువ తినే ఆస్కారం ఉంటుంది. 

అన్నిరకాల గింజల్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే... అంత మంచిది. శరీరంలోని కొవ్వు కరగడంతోపాటు, కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరూ మెరుగుపడుతుంది. సెనగలు, బఠాణీలు, పెసర మొలకల్లాంటివి పావు కప్పు తిన్నా... పొట్టనిండుగా అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి చక్కటి పోషకాహారం. 

యాపిల్‌లో విటమిన్‌-సి ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డైటింగ్‌ చేసేవారు దీన్ని రోజూ తీసుకుంటే... మంచి ఫలితం ఉంటుంది. అనారోగ్య సమస్యలు, నీరసం వంటివి బాధించవు. ఇన్‌ఫెక్షన్ల వంటివీ దరిచేరవు.