వాలెంటైన్స్ డే రోజున అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లడమొక్కటే సరిపోదు. చర్మం ఆరోగ్యంగా, అందంగా మెరిసిపోవాలంటే ఇంకొన్ని చిట్కాను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది మరి.
వాలెంటైన్స్ వీక్ ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ వీక్ లో ప్రతిరోజూ పండగే. ఈ వీక్ ప్రేమికులంతా ఏకాంతంగా సమయాన్ని గడుపుతారు. లాంగ్ డ్రైవ్ కు వెళుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలు మరింత అందంగా కనిపించాలనుకుంటారు. నిజానికి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయాన్ని సరదాగా, ఆనందంగా గడుపుతారు. ముఖంపై మచ్చలు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు ఉంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. నేను అందంగా లేను అని బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా అందంగా కనిపిస్తారు. అవేంటంటే..
షీట్ మాస్క్
ముఖం శుభ్రంగా ఉండటం కోసం రోజూ షీట్ మాస్క్ కు వాడటం చాలా ముఖ్యం. ఇది మీ ముఖాన్నితాజాగా, అందంగా ఉంచుతుంది. మార్కెట్ లో చాలా రకాల షీట్ మాస్క్ లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ చర్మ రకాన్ని బట్టి షీట్ మాస్క్ ను ఎంచుకోవచ్చు. అంటే జిడ్డు, పొడి చర్మం ఉన్నవారు వారి చర్మానికి తగ్గట్టు వీటిని వాడొచ్చు. విటమిన్ ఇ, విటమిన్ సి, హైలురోనిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్న ఈ ఫేస్ మాస్క్ లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు నిమ్మరసం, రోజ్ వాటర్, టమోటాలు, నారింజ, కలబంద, బొప్పాయి వంటి పదార్థాలతో మీరు ఇంట్లోనే ఈ మాస్క్ ను తయారుచేసుకుని వాడొచ్చు. ఇవి కూడా మీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి.
ఎక్స్ఫోలియేషన్ అవసరం
ముఖంపై ఉన్న మృతకణాలను తొలగిస్తేనే చర్మం అందంగా మారుతుంది. అందుకే వారానికి రెండు మూడు సార్లు ఎక్స్ఫోలియేషన్ చేయండి. ఇందుకోసం అలోవెరా జెల్, కాఫీ, నిమ్మరసం, పంచదార, తేనెను బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయండి. దీనివల్ల ముఖంలోని మృతకణాలు తొలగిపోతాయి. మీరు కావాలనుకుంటే మార్కెట్ లో దొరికే తేనె ఫేస్ స్క్రబ్స్ ను కూడా వాడుకోవచ్చు. దీన్ని 5 నిమిషాల పాటు మసాజ్ చేసిన సాధారణ నీటితో ముఖాన్ని కడగండి. ఇది చర్మాన్ని అందంగా చేస్తుంది. పోషణను అందిస్తుంది.
హైడ్రేట్
మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, డిటాక్స్ చేయడానికి రోజూ పుష్కలంగా నీటిని తాగాలి. కొంతమందికి ఎప్పుడూ మొటిమలు అవుతుంటాయి. దీనికి అసలు కారణమేంటో తెలుసా? నీటిని సరిగ్గా తాగకపోవడమేనంటున్నారు నిపుణులు. నీటిని సరిగ్గా తాగకపోవడం వల్ల చర్మం డల్ గా కనిపిస్తుంది. చర్మ సమస్యలు కూడా అవుతుంటాయి. అందుకే నీటిని పుష్కలంగా తాగేలా చూసుకోండి.
పోషకమైన ఆహారాన్ని తినండి
మీరు తినే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు పుష్కంగా ఉండేలా చూసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ముఖంపై గ్లోను పెంచుతుంది. ఇందుకోసం రంగురంగుల కూరగాయలు, పండ్లను రోజూ తినండి. ఇవి మీ శరీరానికి పోషణను అందిస్తాయి. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. ఇవి చర్మాన్నే కాదు, జుట్టును కూడా అందంగా మారుస్తాయి.
ఒత్తిడికి దూరంగా ఉండండి
పని ఒత్తిడి అలసటను మరింత పెంచుతుంది. దీనివల్ల మీ చర్మం డల్ గా మారుతుంది. అలసటను పోగొట్టుకోవడానికి రెగ్యులర్ గా ధ్యానం చేయండి. అలాగే వ్యాయామం చేయండి. 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. కళ్లు ఉబ్బుతాయి.
