ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరినీ డార్క్ సర్కిల్స్ సమస్య వేధిస్తోంది. సరైన నిద్ర లేకపోవడం, ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువగా చూడటం, టెన్షన్.. ఇలా కారణం ఏదైనా డార్క్ సర్కిల్స్ రావడం మాత్రం  సాధారణమైపోయింది. మార్కెట్లో దొరికే క్రీములు ఎన్ని వాడినా.. ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే. అయితే.. కేవలం వంటింటిలో లభించే  కొన్ని పదార్థాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో మనమూ చూసేద్దామా..

టమాట..

కంటి చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్ ని తొలగించడంలో టమాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక స్పూన్ టమాట రసంలో  మరో టీ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కలిపి కంటి చుట్టూ అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత  చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకి రెండు సార్లు చొప్పున రెండు మూడు వారాలపాటు రెగ్యులర్ గా చేస్తూ.. సమస్య తగ్గుతుంది.

బంగాళదుంపలు..

బంగాళదుంపలను చక్రాల్లాగా కట్ చేసుకొని కంటిపై పెట్టుకోవాలి. ఓ పదినిమిషాల తర్వాత తీసి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లు ఫ్రెష్ గా ఉండటంతోపాటు.. నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.

టీ బ్యాగ్ లు

వాడేసిన టీ బ్యాగ్ లను ఫ్రిజ్ లో ఉంచి.. తర్వాత వాటిని మీ కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలపై పెట్టుకోండి. ఇలా రోజు చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. 

చల్లటి పాలు 
చల్లటి పాలలో దూది ముంచి కళ్లపై పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత దూది తీసేసి, కళ్లను శుభ్రం చేసుకోండి. 

నారింజ రసం 
నారింజ రసంలో కొద్దిగా గ్లిసరిన్ చుక్కలు వేసి కలపడండి. ఆ రసాన్ని డార్క్ సర్కిళ్లపై రాయండి. ఇలా చేస్తే నల్లటి వలయాలు మాయం కావడమే కాదు, మీ కళ్లు కాంతివంతం అవుతాయి.