లోక్‌సభ ఎన్నికల ముందు నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-18లో దేశంలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగి 45ఏళ్ల గరిష్ఠానికి చేరిందని నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

ఎన్ఎస్ఎస్ఓ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయకున్నా.. అందులోని వివరాలను ఆ మీడియా సంస్థ తమ కథనంలో ఉటంకించడంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి తెరతీసింది.2017జూలై నుంచి 2018 జూన్ మధ్య దేశంలో నిరుద్యోగ రేటు 6.1శాతంగా నమోదైందని పేర్కొంటూ ఎన్ఎస్ఓస్ఓ ఞక నివేదిక వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది.

1972-73 తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే. పట్టణ ప్రాంతంలో నిరుద్యోగం 7.8శాతంగా ఉండగా.. గ్రామాల్లో 5.3శాతంగా నమోదైందని ఎన్‌ఎస్‌ఎస్ఓ నివేదికలో పేర్కొన్నది. నల్లధనం వెలికితీత, అవినీతికి అడ్డుకట్ట వేసే పేరిట 2016 నవంబర్‌ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత నిరుద్యోగులపై ఎన్ఎస్ఎస్ఓ సర్వే చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఉద్యోగాల కల్పన సర్వేను ప్రచురించకపోవడం, యూపీఏ హయాం కన్నా ఎన్డీయే పాలనలోనే ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు వీలుగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)ని లెక్కించే ప్రమాణాలను మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 

ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాతీయ గణాంకాల సంఘం నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గణాంకాల కమిషన్ తాత్కాలిక ఛైర్మన్ పీసీ మోహనన్, మరో సభ్యురాలు మీనాక్షి తమ పదవులకు రాజీనామా చేశారు.

ఎన్ఎస్ఎస్ఓ సభ్యుల రాజీనామాలపై స్పందించిన ప్రభుత్వం.. సర్వే నివేదికను విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని, తగిన సమయంలో ఈ నివేదికను విడుదల చేస్తామని వెల్లడించింది. 

ఈ లోగానే నిరుద్యోగితపై నివేదిక బయటకు వచ్చింది. కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందే ఈ నివేదిక రావడంతో రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలు మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అయితే ఈ నివేదికే ఫైనల్‌ కాదని సర్కార్‌ పేర్కొనడం గమనార్హం. ఈ సర్వేను ప్రభుత్వం పరిశీలించలేదని నీతి ఆయోగ్‌ పేర్కొన్నది. ఎన్ఎస్ఎస్ఓ నివేదికను వెల్లడించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కావాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సెలవిచ్చారు. 

కానీ రాజీవ్ కుమార్ వాదనను జాతీయ గణాంకాల కమిషన్ (ఎన్ఎస్సీ) మాజీ చైర్మన్ ప్రణబ్ సేన్ కొట్టి పారేశారు. గతంలో ఎన్నడూ ఎన్ఎస్ఎస్ఓ నివేదికను బహిర్గతం చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. ఎన్ఎస్ఎస్ఓ సర్వేలను ఆమోదించడానికి ఒక విధానం ఉన్నదని పేర్కొన్నారు.

ఎన్ఎస్ఎస్ఓ అత్యంత నిపుణులతో కూడిన కమిటీ అని కోల్ కతా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్పీ ముఖర్జీ స్పష్టం చేశారు. ఎన్ఎస్ఎస్ఓ డైరెక్టర్ జనరల్ సంతకం చేసిన మరుక్షణం సదరు నివేదిక ఎన్ఎస్సీకి వెళ్లిపోతుందని ప్రణబ్ సేన్ తేల్చేశారు.