Beijing: మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అక్టోబర్ లో జరిగిన ఒక ప్రధాన పార్టీ కాంగ్రెస్ లో చైనా కమ్యూనిస్టు పార్టీ అధిపతిగా చారిత్రాత్మక మూడవ పర్యాయం బాధ్యతలు చేపట్టిన ఆయన మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
Xi Jinping reappointed as President of China: చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్ పీసీ) సమావేశాల్లో జీ జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్ గా కూడా ఆయన ఎన్నికైనట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
మరో అభ్యర్థి లేని ఎన్నికల్లో జీ జిన్ పింగ్ అధ్యక్షుడవ్వాలని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లో దాదాపు 3,000 మంది (ఎన్ పీసీ) సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఎన్నికల అనంతరం 69 ఏళ్ల ఆయన రాజ్యాంగానికి విధేయతను చూపుతానని బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. కాగా, కాలపరిమితిని రద్దు చేస్తూ 2018లో రాజ్యాంగంలో చేసిన మార్పుతో జిన్ పింగ్ కొత్త ఐదేళ్ల పదవీకాలం సాధ్యమైంది.
గత అక్టోబర్ లో జరిగిన ఒక ప్రధాన పార్టీ కాంగ్రెస్ లో చైనా కమ్యూనిస్టు పార్టీ అధిపతిగా చారిత్రాత్మక మూడవ పర్యాయం బాధ్యతలు చేపట్టిన ఆయన మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దేశ నాయకత్వ మార్పులు ప్రతి ఐదేళ్లకోసారి జరుగుతాయి. సాధారణంగా పార్టీ కాంగ్రెస్ లో ప్రకటించే పునర్వ్యవస్థీకరణకు దగ్గరగా ప్రతిబింబిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
చైనా అధ్యక్షుడి మందున్న సవాళ్లు..
చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ శుక్రవారం మూడోసారి చారిత్రాత్మకంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ఆయన ఎలా ఎలా పరిష్కరిస్తాడనే విషయం పై చర్చ జరుగుతోంది. వాటిలో..
మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ
చైనా ఆర్థిక వ్యవస్థ ఇదివరకటి కంటే ప్రస్తుతం మందగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే, రానున్న ఐదు సంవత్సరాల్లలో జీ జిన్ పింగ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అయితే, పార్టీ అగ్ర శ్రేణులకు ప్రధాన్యత క్రమంలో అభివృద్దిని పణంగా పెట్టి భావజాలానికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆందోళనలను రేకెత్తించింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం కేవలం మూడు శాతం మాత్రమే విస్తరించింది. కఠినమైన కోవిడ్ నియంత్రణలు, ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 5.5 శాతం లక్ష్యంలో వెనుకబడిపోయింది.
యూఎస్‌తో ఉద్రిక్తతలు..
ఇటీవలి సంవత్సరాలలో చైనా-అమెరికాల మధ్య సంబంధాలు స్థిరంగా క్షీణించాయి, వాణిజ్యం, మానవ హక్కులు, కోవిడ్ -19 మూలాలు వంటి అనేక సమస్యలపై ఇరుపక్షాలు దూకుడుగా సరికొత్త యుద్ధానికి తెరలేపాయి. గత నెలలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రణాళికాబద్ధమైన పర్యటన చివరి నిమిషంలో యూఎస్ భూభాగంపై నిఘా నిర్వహిస్తోందని చైనా బెలూన్‌ను కూల్చివేసిన తర్వాత రద్దు చేసుకున్నారు. ఈ వాదనను చైనా తీవ్రంగా ఖండించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంఘర్షణ మరింతగా ముదిరింది.
తైవాన్ బెదిరింపులు
తైవాన్‌తో ఉద్రిక్తతలను పెంచిన తర్వాత, స్వయం-పాలిత ప్రజాస్వామ్య ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనే బీజింగ్ చిరకాల వాంఛను నెరవేర్చడానికి కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశముంది. ఇటీవలి సంవత్సరాలలో తైవాన్‌పై చైనా ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై అమెరికా సహా పలు దేశాలు అంతర్జాతీయంగా చైనా తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
మానవ హక్కులు ఉల్లంఘనలు..
చైనాలో మానవహక్కులకు రక్షణ లేకుండా పోయిందని చాలా సార్లు రిపోర్టులు పేర్కొన్నాయి. ఆ దేశ పౌరులు ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వారిని నిర్భంధించడం, హింసకు గురిచేయడంతో ఇప్పటికే అనేక మంది కార్యకర్తలు దేశం విడిచి పారిపోయారు.
