సారాంశం
ఉటాకు చెందిన ఒక మహిళ భర్త హఠాత్తుగా మరణించాడు. ఆ విషాదం నుంచి బయటపడడానికి ఆమె తన పిల్లలకోసం ఓ పుస్తకం రాసింది. అయితే.. సోమవారం భర్త హత్య కేసులో ఆమె అరెస్టు అయ్యింది.
అమెరికా : ఓ మహిళ తన భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక.. తన పిల్లలతో కలిసి ఓ పుస్తకాన్ని రాసింది. తనకు, తన పిల్లలకు ఆ విషాదాన్ని తట్టుకోవడం కష్టమయ్యింది కాబట్టే ఆయన జ్ఞాపకార్థం ఆ పుస్తకం రాశానని చెప్పుకొచ్చింది. అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆమె భర్తది సహజమరణం కాదని.. హత్య అని తేల్చారు. భార్యే విషం ఇచ్చి చంపిందని.. సోమవారం ఆమెను అరెస్ట్ చేశారు.
సమ్మిట్ కౌంటీకి చెందిన కౌరీ డార్డెన్ రిచిన్స్ (33), 2022 మార్చి 4న తమ ఇంట్లోనే తన భర్త ఎరిక్ రిచిన్స్‌కి విషం కలిపిచ్చి హత్య చేసినందుకు సోమవారం అరెస్టు చేశారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె ఈ కేసులో హత్యానేరం ఎదుర్కొంటోంది. అంతేకాదు పరిమితికి మించి మెడిసిన్ డోస్ ఇచ్చినందుకు ఆ మహిళపై మూడు సెకండ్-డిగ్రీ నేరారోపణలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
మీడియా నివేదికల ప్రకారం, ఎరిక్ మరణించిన రోజు రాత్రి 3:20 గంటలకు పోలీసులు వారి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయానికి అతను మంచం దగ్గర పడిపోయి ఉన్నాడు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్సలు చేశారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు తేలింది.
2022, మార్చిలో, రిచిన్స్ రాత్రి పొద్దుపోయిన తరువాత పోలీసులకు కాల్ చేసి, ఆమె భర్త ఎరిక్ రిచిన్స్ "శరీరం చల్లగా" ఉందని తెలిపింది. చనిపోవడానికి కొద్ది గంటలకు ముందు తన భర్తకు మిక్స్‌డ్ వోడ్కా డ్రింక్ ఇచ్చానని ఆమె అధికారులకు చెప్పింది. అయితే, పోస్టుమార్టంలో రిచిన్స్ ఫెంటానిల్ ఓవర్ డోస్ వల్ల చనిపోయాడని వైద్యులు కనుగొన్నారు.
రిచిన్స్ శరీరంలో ఐదు రెట్లు అధికమైన ప్రాణాంతకమైన ఫెంటానిల్ ఓవర్ డోస్ ఉందని వైద్యులు తెలిపారు. కోర్టుకు ఇచ్చిన పత్రాల ప్రకారం, డిసెంబర్ 2021 - ఫిబ్రవరి 2022 మధ్య, రిచిన్స్ వెన్ను నొప్పికి మందులను ప్రిస్క్రిప్షన్ టెక్స్ట్ చేశాడు. దీంతో ఆ మందులు ఆయనకు వచ్చాయి. ఆ తరువాత ఇంకా స్ట్రాంగ్ డోస్ కావాలని మెసేజ్ పెట్టాడు.
మూడు రోజుల తర్వాత రిచిన్స్కు డ్రగ్స్ వచ్చాయి. ఆ తరువాతి రోజు ఆ జంట వాలెంటైన్స్ డే డిన్నర్ చేసారు, ఆ తర్వాత అతను అనారోగ్యానికి గురయ్యాడు. రెండు వారాల తర్వాత, రిచిన్స్ ను ఇంకో డోస్ ఫెంటానిల్ ఇచ్చారు. మార్చి 4న రిచిన్స్ సతీమణి అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి తన భర్త స్పందించడం లేదని ఫిర్యాదు చేసింది.
ఆ తరువాత భర్త మరణం మీద ఆమె "ఆర్ యు విత్ మీ?" అనే ఫోటో బుక్ ను కూడా రాశారు. ప్రియమైన వ్యక్తి మరణాన్ని ఎదుర్కోవటానికి పిల్లలకు సహాయం చేయడానికి అని తెలిపింది.
భర్త మరణం కలిగిన విషాదంనుంచి తను, తన ముగ్గురు పిల్లలకు శాంతిని కలిగించడానికి ఈ పుస్తకం అని చెప్పింది. "ఈ పుస్తకం మా కుటుంబానికి మాత్రమే కాదు. ఇలాంటి విషాదాన్ని ఎదుర్కొంటున్న ఇతర కుటుంబాలకు కూడా కొంత ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నాం" అని ఆమె గత నెలలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మీద మే 19న నిర్బంధ విచారణ జరగనుంది.