Wickremesinghe: భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి బెదిరింపులకు శ్రీలంకను స్థావరంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబడదని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు.

Wickremesinghe: భారత్‌పై బెదిరింపులకు పాల్పడానికి తమ దేశాన్ని స్థావరంగా (మిలిటరీ స్థావరం) ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. దీనితో పాటు.. శ్రీలంక చైనాతో ఎటువంటి సైనిక ఒప్పందం చేసుకోకుండా తటస్థంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. బ్రిటన్, ఫ్రాన్స్‌లలో అధికారిక పర్యటనలో ఉన్న విక్రమసింఘే సోమవారం ఫ్రెంచ్ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.

"శ్రీలంక తటస్థ దేశం, కానీ భారతదేశానికి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడటానికి శ్రీలంకను స్థావరంగా ఉపయోగించడాన్ని తాము అనుమతించబోం" అని విక్రమసింఘే అన్నారు. చైనా సైనిక ఉనికి గురించిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. చైనీయులు దేశంలో శతాబ్దాలుగా ఉన్నారని, కానీ, వారికి ఎలాంటి సైనిక స్థావరం లేదని అన్నారు. చైనాతో ద్వీప దేశానికి ఎలాంటి సైనిక ఒప్పందం లేదని విక్రమసింఘే స్పష్టం చేశారు. హంబన్‌తోట నౌకాశ్రయాన్ని చైనా వ్యాపారులకు ఇచ్చినప్పటికీ, దానిని శ్రీలంక ప్రభుత్వమే నియంత్రిస్తుందని ఆయన తెలిపారు. రుణానికి బదులుగా 99 ఏళ్ల లీజుపై 2017లో చైనా దీనిని తీసుకుందని, సదరన్ నేవల్ కమాండ్‌ను హంబన్‌తోటకు తరలించామని, హంబన్‌తోట పరిసర ప్రాంతాల్లో బ్రిగేడ్‌ను మోహరించినట్లు ఆయన తెలిపారు.

శ్రీలంకలో చైనా సైనిక నౌకలు

గత సంవత్సరం చైనా బాలిస్టిక్ క్షిపణి , ఉపగ్రహ నిఘా నౌక యువ వాంగ్ ఫైవ్‌ను హంబన్‌తోట నౌకాశ్రయంలో డాక్ చేయడానికి అనుమతించింది శ్రీలంక. ఇది వ్యూహాత్మక హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఉనికి పెరగటంపై భారతదేశం , USలో ఆందోళనలను రేకెత్తించింది. 2014లో చైనా అణు సామర్థ్యం గల జలాంతర్గామిని తన ఓడరేవులో డాక్ చేసేందుకు శ్రీలంక అనుమతించడంతో భారత్ , శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.