అజ్ఞాతంలో నుంచి వచ్చిన పాక్ మాజీ పీఎం షరీఫ్.. కశ్మీర్ గురించి ఎందుకు మాట్లాడారు?

నాలుగేళ్ల అజ్ఞాతవాసంలో గడిపి పాకిస్తాన్‌కు తిరిగి వచ్చి లాహోర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడారు. తన ప్రసంగంలో పరోక్షంగా భారత్‌ను ప్రస్తావించారు. కశ్మీర్ అంశాన్ని తట్టారు. కశ్మీర్ గురించి నవాజ్ షరీఫ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది?
 

why pakistan former pm nawaz sharif mentioned kashmir in his speech kms

న్యూఢిల్లీ: నాలుగేళ్లు లండన్‌లో స్వీయ అజ్ఞాతంలో గడిపిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి స్వదేశానికి వచ్చారు. వచ్చిన వెంటనే లాహోర్‌లో మినార్ ఎ పాకిస్తాన్‌ వద్ద నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తనకు పాకిస్తాన్ ఆర్మీతో ఎలాంటి శత్రుత్వం లేదని, కేవలం పాకిస్తాన్ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యం అని అన్నారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉన్నదని, పాకిస్తాన్ ఒక సొంత విదేశాంగ విధానాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోడానికి భారత్‌తో చర్చించాల్సి ఉన్నదని 73 ఏళ్ల షరీఫ్ అన్నారు. ఇంతకీ ఆయన కశ్మీర్ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు? ఇమ్రాన్ ఖాన్ అరెస్టయిన సందర్భంలో ఆయన పాకిస్తాన్‌కు రావడం వెనుక మతలబు ఏమిటీ? అనే అంశాలను తెలుసుకుందాం.

భారత్ పై షరీఫ్ వ్యాఖ్యలకున్న ప్రాధాన్యత ఏమిటీ?

నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో లాహోర్ బస్ ట్రిప్ సందర్భంలో కలిశారు. రెండోసారి 2015లో ప్రధాని మోడీ పాకిస్తాన్‌కు ఓ సర్‌ప్రైజ్ ట్రిప్‌ వేసినప్పుడు కలిశారు. ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు మొదలుకావల్సిన పరిస్థితలను పాకిస్తాన్ ఆర్మీ మార్చివేసింది. 1999లో కార్గిల్ వార్‌కు దిగి, 2016లో పఠాన్ కోట్ పై ఉగ్రదాడితో పాకిస్తాన్ ఆర్మీ బ్రేకులు వేసింది. పొరుగు దేశంతో సత్సంబంధాలను షరీఫ్ ఆశించడం మంచిదే కానీ, అందుకు ఆ దేశ ఆర్మీ అనుమతి ముందుగా ఆయన తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పాకిస్తాన్ పై కామెంట్లు..

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేశాక కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ మాట్లాడటానికేమీ లేదని, కశ్మీర్ సమస్య తీరిపోయిందని భారత భద్రతా నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ వాసుల ముఖ్యంగా వారి ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి ఉంటారని వివరిస్తున్నారు. కశ్మీర్ గురించి సరిహద్దు వెలుపలి నుంచి జరిగే ఉగ్రవాదం, క్రాస్ బార్డర్ ఫైరింగ్ గురించి తప్పితే భారత్ చర్చించడానికి సిద్ధంగా లేదనీ తెలుపుతున్నారు.

Also Read: మోడీ ఎప్పటికీ ప్రధాని కాకూడదు .. అదే నా లక్ష్యం : రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఒవైసీ కీలక వ్యాఖ్యలు

షరీఫ్‌ను ప్రధాని చేయాలని పాక్ ఆర్మీ అనుకుంటున్నదా?

షరీఫ్‌ను ప్రధానిని చేయాలని పాకిస్తాన్ ఆర్మీ అనుకోవడం లేదని, కానీ, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ రాజకీయంగా పూర్తిగా లేకుండా చేయాలనే లక్ష్యం దానికి ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ మళ్లీ అధికారంలోకి రాకుండా చెక్ పెట్టాలని పాక్ ఆర్మీ చూస్తున్నది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios