జీ20 సదస్సు: భారత్‌లో అందుకే పర్యటించలేదు: రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరణ
భారత అధ్యక్షతన ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. తాజాగా, తాను రాకపోవడానికి పుతిన్ స్వయంగా వివరించాడు.

న్యూఢిల్లీ: భారత్ దిగ్విజయంగా జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు గైర్హాజరయ్యారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన రష్యా, దాన్ని ఖండించకుండా అండగా నిలిచిన చైనా దేశాల అధ్యక్షులు రాకపోవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. చైనాతో సరిహద్దు విషయమై వైరిపూర్వక వాతావరణం నెలకొన్నా.. రష్యాతో మాత్రం సత్సంబంధాలే ఉన్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా రష్యా చమురును ఆంక్షలను ధిక్కరించి మరీ భారత్ చౌకగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు రాకపోవడంపై చర్చ జరిగింది. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే స్వయంగా తాను ఎందుకు భారత్‌కు రాలేదో వివరణ ఇచ్చాడు.
రష్యాలోని సోచి నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. భారత్ పై ప్రశంసలు కురిపిస్తూ పశ్చిమ దేశాలపై నిప్పులు చెరిగాడు. పాశ్చాత్య దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని అంగీకరించిన ఏ దేశాన్ని అయినా శత్రువుగానే చూపెట్టే ప్రయత్నం చేస్తాయని ఆరోపించాడు. ఇందులో భాగంగానే భారత్ సహా ఇతర దేశాలకూ ఆ ప్రమాదం ఉన్నదని తెలిపాడు. అయితే, భారత్ స్వతంత్రంగా పని చేస్తున్నదని వివరించాడు. భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నదని పేర్కొన్నాడు. ఈ కారణంగానే రష్యా నుంచి భారత్‌ను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని, అవి అర్థం లేనివని స్పష్టం చేశాడు.
Also Read: ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కితాబు
భారత అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సుకు రావాలని తాను అనుకున్నాడని, కానీ, ఆ సమావేశాలను పొలిటికల్ షోగా మార్చకూడదనే అభిప్రాయంతోనే భారత్‌కు రాలేదని పుతిన్ వివరించాడు. సమావేశాలకు వచ్చి తన స్నేహితులకు ఎందుకు సమస్యలు సృష్టించాలని అడిగాడు. భారత్ సహా ఇతర మిత్ర దేశాలు ఇరకాటంలో పడకూడదనే తాను జీ 20 సదస్సుకు గైర్హాజరైనట్టు వివరించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించాడు.
ఉక్రెయిన్ పై యుద్ధానికి గాను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఐసీసీ సభ్యదేశాల్లో ఆయన పర్యటిస్తే అరెస్టు ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుంది.