ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కితాబు
భారత ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించిదని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (ఈఈఎఫ్)లో పుతిన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. రష్యన్ న్యూస్ ప్లాట్ ఫారమ్ ఆర్టీ న్యూస్ విడుదల చేసిన ఓ వీడియోలో పుతిన్.. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించిదని అన్నారు.
‘‘ప్రధాని మోడీతో మాకు మంచి రాజకీయ సంబంధాలున్నాయి. ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో ఎంతో పురోగతి సాధిస్తోంది. ఇది భారతదేశం- రష్యా రెండింటి ప్రయోజనాలను పూర్తిగా నెరవేరుస్తుంది’’ అని అన్నారు.
భారత్ లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ఆమోదించిన నేపథ్యంలో పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను, ముఖ్యంగా తయారీ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 2014లో మోడీ ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని కూడా పుతిన్ కొనియాడారు.
దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భారత్ సాధించిన విజయం నుంచి రష్యా నేర్చుకోవాలని సూచించారు. అప్పుడు దేశీయంగా తయారైన కార్లు లేవని, కానీ ఇప్పుడు ఉన్నాయని పుతిన్ అన్నారు. ‘‘మన భాగస్వాములలో చాలా మందిని ఫాలో కావాలని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు భారతదేశం. భారత్ తయారీ రంగంపై ఫోకస్ పెట్టింది. వాహనాల తయారీ, వినియోగంపై దృష్టి సారించింది. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో ప్రధాని మోడీ సరైన పని చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఆయన చెప్పింది కరెక్టే.’’ అని అన్నారు.