Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఒమిక్రాన్ ఎందుకు వేగంగా వ్యాపిస్తున్నదంటే.. మూడు కారణాలు చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

గతేడాది నవంబర్‌లో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్... ఇప్పుడు ప్రపంచం నలుమూలలకు వ్యాపించింది. భారత్‌లోనూ గణనీయంగా ఈ వేరియంట్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. డెల్టా సహా గత వేరియంట్ల కంటే అత్యధిక వేగంతో వ్యాపించే వేరియంట్ ఇదేనని డబ్ల్యూహెచ్‌వో సహా పలువురు నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకు వేగంగా వ్యాపిస్తున్నదో మూడు కారణాలను వివరించింది.
 

WHOs three reasons why omicron spreads fast
Author
New Delhi, First Published Jan 9, 2022, 4:58 PM IST

న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా దేశంలో వెలుగుచూసిన కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) ప్రపంచం నలుమూలలకు వ్యాపించింది. మన దేశంలోనూ భారీగా ఈ వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క సారిగా మన దేశంలో కేసులు పెరగడం వెనుక ఈ వేరియంటే ఉన్నదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కానీ, జీనమో సీక్వెన్సింగ్ ఫలితాల జాప్యం వల్ల సరైన ఒమిక్రాన్ కేసులు స్పష్టంగా బయట పడటం లేదని చెబుతున్నారు. గత వేరియంట్లు అన్నింటికంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని(Spreads Fast) ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సహా పలువురు నిపుణులు స్పష్టం చేశారు. అయితే, ఈ వేరియంట్ వేగంగా వ్యాపించడానికి డబ్ల్యూహెచ్‌వో మూడు కారణాలను వెల్లడించింది.

ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరించడానికి చాలా కారణాలు ఉన్నాయని, అందులో మూడు కారణాలు వెల్లడిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో కొవిడ్-19 టెక్నికల్ లీడ్ మారియా వ్యాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌లో కనిపించిన ఉత్పరివర్తనాలు.. ఆ వైరస్ సులువుగా మనిషి కణజాలాన్ని పట్టి ఉండటానికి, అతుక్కుని ఉండటానికి అనుకూలంగా ఉన్నాయని వివరించారు. రెండోది.. ఈ వేరియంట్ మనిషి వ్యాధి నిరోధక శక్తి నుంచి సులువుగా తప్పించుకోగలదని తెలిపారు. అంటే.. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన వారికి కూడా ఈ వేరియంట్ సులువుగా సోకవచ్చు. అంతేకాదు, టీకా వేసుకున్నవారికి కూడా సోకే సామర్థ్యం ఈ ఇమ్యూన్ ఎస్కేప్ కారణంగా కలిగిందని చెప్పారు. ఈ వేరియంట్ సులువుగా ఒకరి నుంచి ఇంకొకరికి సోకడానికి అనుకూలమైన అవకాశాన్ని కలిగి ఉన్నదని పేర్కొన్నారు. డెల్టా సహా గత వేరియంట్లు అన్ని కూడా మానవ శ్వాస వ్యవస్థలోని దిగువ భాగంలో వైరస్ వృద్ధి చెందేదని తెలిపారు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ అప్పర్ ట్రాక్ట్‌లో అంటే శ్వాస వ్యవస్థలో ఎగువ భాగాన అభివృద్ధి చెందుతుందని వివరించారు. కాబట్టి, ఇతరులకు సులువుగా వ్యాపించగలుగుతున్నదని తెలిపారు.

డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రతతో లక్షణాలు కలిగిస్తున్నదని, అనారోగ్య తీవ్రత తక్కువగా ఉన్నదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని, కానీ, ఆ కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆమె వివరించారు. ప్రజల నిర్లక్ష్యం వల్ల ఈ వేరియంట్ మరింత వేగంతో వ్యాప్తి చెందుతుందని అన్నారు. కాబట్టి, మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఎందుకంటే.. డెల్టా కంటే తక్కువ తీవ్రతతోనే ఒమిక్రాన్ ఉండవచ్చు కానీ, అత్యధిక కేసుల కారణంగా హాస్పిటల్ చేరుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటున్నదని, తద్వారా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని పేర్కొన్నారు. కాబట్టి, వ్యాక్సిన్ తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్త పడాలని, ఇతర ముందు జాగ్రత్తలూ తీసుకుని సురక్షితంగా ఉండాలని తెలిపారు.

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శనివారం రోజులు దేశంలో 89,28,316 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ 1,51,57,60,645కు చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 3,623 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,409 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వివరాలను వెల్లడించాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios