హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ముగిశాక.. గాజాను ఎవరు పాలిస్తారు? ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారంటే?
హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన తర్వాత, హమాస్ ఉగ్రవాదం ముగిసిపోయిన తర్వాత గాజా స్ట్రిప్‌ను ఎవరు పాలించాలి? ఈ ప్రశ్నపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని మిలిటరీ గ్రూప్ హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న విధ్వంసకర యుద్ధం ముగిశాక.. గాజాను ఎవరు పాలిస్తారు? హమాస్ గ్రూపును అంతమొందించిన తర్వాత ఆ గాజా స్ట్రిప్‌ను ఎవరు పరిపాలిస్తారనే ప్రశ్న కొన్ని వారాలుగా చర్చనీయాంశమైంది. హమాస్ పై యుద్ధం ఐదు వారాలకు చేరిన తరుణంలో ఈ ప్రశ్నపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హమాస్ పై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ ప్రశ్నపై స్పందించారు.
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ను 2007 నుంచి హమాస్ పరిపాలిస్తున్నది. అంతకుముందు పాలస్తీనియన్ అథారిటీ (పీఏ) అధికారంలో గాజా ఉండేది. కానీ, వీధి పోరాటాల చేసి పీఏ నుంచి అధికారాన్ని హమాస్ హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటికీ హమాస్ పాలనలోనే ఈ గాజా స్ట్రిప్ ఉన్నది. ఇప్పుడు హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యం అని ఇజ్రాయెల్ చెబుతున్నది. ఐదు వారాలుగా యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఒక వేళ ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరితే అప్పుడు ఆ గాజా స్ట్రిప్‌ను ఎవరు పాలిస్తారు? అనే ప్రశ్న ఈ సందర్బంగా ఉదయిస్తున్నది.
గత నెలలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. మళ్లీ గాజా స్ట్రిప్‌ను హమాస్ చెర నుంచి పీఏ అధీనంలోకి తీసుకోవాలని అన్నారు. ఇది సులువుగా జరగడానికి అంతర్జాతీయ జోక్యం కూడా ఉండాలని వివరించారు. పాలస్తీనియన్ అథారిటీ ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని కొంత భూభాగాన్ని పాలిస్తున్నది.
Also Read: నేను బ్రతికే ఉన్నాను.. తన మర్డర్ కేసు విచారణకు సుప్రీంకోర్టులో హాజరు
కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణకు సమగ్రమైన రాజకీయ పరిష్కారం లభించిన తరవాతే గాజాను పీఏ అధీనంలోకి తీసుకోవడం వీలవుతుందని ఆంటోనీ బ్లింకెన్‌తో ఓ సమావేశంలో పాలస్తీనియన్ ప్రెసిడెంట్ మహముద్ అబ్బాస్ తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. గాజాను మళ్లీ ఆక్రమించాలని ఇజ్రాయెల్ అనుకోవడం లేదని స్పష్టం చేశారు. 1967లో గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించింది. 2005లో అక్కడి నుంచి ఉపసంహరించుకుంది. ఆ తర్వాత స్థానికంగా పాలస్తీనియన్ అథారిటీ రూలింగ్ ప్రారంభించింది. ‘మేం గాజాను పాలించాలని అనుకోవడం లేదు. ఆక్రమించాలనీ అనుకోవడం లేదు. వారికి, మాకు మంచి భవిష్యత్తు ఉండాలనే మేం కోరుకుంటున్నాం’ అని నెతన్యాహు అన్నారు. గాజా భవిష్యత్ గురించి మాట్లాడుతూ.. అక్కడ సాయుధీకరణ, ర్యాడికలైజేషన్ ఉండకూడదని, పునర్నిర్మాణం జరగాలని అన్నారు. ‘అక్కడ ఒక పౌర ప్రభుత్వం ఉండాలి’ అని ముక్తసరిగా చెప్పారు. ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలనే విషయాన్ని చెప్పలేదు.