నేను బ్రతికే ఉన్నాను.. తన మర్డర్ కేసు విచారణకు సుప్రీంకోర్టులో హాజరు
సుప్రీంకోర్టులో ఓ మర్డర్ కేసు విచారణ జరుగుతున్నది. ఆ విచారణలోకి 11 ఏళ్ల బాలుడు కూడా హాజరై తాను హత్యకు గురికాలేదని, తాను బ్రతికే ఉన్నాని న్యాయమూర్తులకు తెలిపాడు. తన తాతను, మేనమామను ఇబ్బందిపెట్టాలనే తండ్రి తప్పుడు కేసు పెట్టాడని పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: ఓ మర్డర్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. 11 ఏళ్ల అబ్బాయిని చంపేశారనేది కేసు. కానీ, ఆ అబ్బాయి నేను బ్రతికే ఉన్నాను మొర్రో అని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లినా పిటిషన్ డిస్మిస్ అయింది. దీంతో అనివార్యంగా సుప్రీంకోర్టుకు వచ్చాడు. ‘నేను బ్రతికే ఉన్నాను. ఆ మర్డర్ కేసు ఫాల్స్ కేసు’ అని చెప్పాడు. ఈ ఆశ్చర్యకర ఘటన ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ ముందు జరిగింది. మర్డర్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో నమోదైంది.
11 ఏళ్ల అభయ్ సింగ్ తల్లిదండ్రులు తరుచూ వాదులాడుకునేవాళ్లు. అదనపు కట్నం కోసం తల్లిని తండ్రి వేధించేవాడు. ఈ చిత్రహింసలు జరుగుతుండగా 2013 నుంచే అభయ్ సింగ్ తన తల్లి పుట్టినింటికి వెళ్లి తాత కుటుంబంతో నివసిస్తున్నాడు. కొన్నాళ్లకు తల్లి మరణించింది. ఆమె తండ్రి.. అభయ్ సింగ్ తండ్రిపై కేసు పెట్టాడు. అప్పుడు అందుకు ప్రతీకారంగా అభయ్ సింగ్ తండ్రి ఆయన తాతపై ఒక ఫాల్స్ కేసు పెట్టాడు. తన మామ, బావమరిది కలిసి తన కొడుకును చంపేశారని ఆ కేసు పెట్టాడు.
Also Read: గుర్రం జాషువా గబ్బిలాన్ని ప్రస్తావించిన ప్రధాని.. తన పర్యటనకు ఆ గబ్బిలంతో ఎలా లింక్ పెట్టారంటే?
తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ మీదకు విచారణకు వచ్చింది. ఈ విచారణకు అభయ్ హాజరయ్యాడు. ‘నేను సురక్షితంగా ఉన్నాను. నేను మా తాతాగారితో ఉంటున్నాను. పోలీసులు తరుచూ ఆ ఇంటికి వచ్చి తాత, అవ్వలను వేధిస్తున్నారు. ఇక పైనా తాత కుటుంబంతో నివసించాలని అనుకుంటున్నాను. కాబట్టి, ఈ కేసు మూసేయాలని కోరుతున్నాను’ అని అభయ్ న్యాయముర్తులకు తెలిపాడు.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ బాలుడు, బాలుడి తాతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కోర్టు అధికారులను ఆదేశించింది.