Asianet News TeluguAsianet News Telugu

చైనాలో లాంగ్యా వైరస్ కలకలం.. ఈ వైరస్ తీవ్రత ఎంత? లక్షణాలేమిటీ? మనుషులకు ఎలా సోకింది?

చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతున్నది. ఇప్పటి వరకు ఈ దేశంలో 35 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు మరణాలు చోటుచేసుకున్నప్పటికీ.. 40 నుంచి 75 శాతం మరణాలు రేటు సంభవించే తీవ్రత ఈ వైరస్‌కు ఉన్నదని రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లాంగ్యా వైరస్ తీవ్రత, లక్షణాలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
 

what is langya virus detected recently in china.. what are the symptoms
Author
New Delhi, First Published Aug 10, 2022, 1:02 PM IST

న్యూఢిల్లీ: చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నదే వార్త చాలా మందిని హడలెత్తించింది. ఎందుకంటే.. ప్రపంచం ఇంకా కరోనా వైరస్‌ను మరిచిపోలేదు. దాని బాధితులు ఇంకా ఉన్నారు. ఇప్పటికీ ఈ మహమ్మారి ప్రాణాలు తీస్తూనే ఉన్నది. అధికారికంగా ఈ వైరస్ తొలిసారి చైనాలోనే నమోదైంది. తాజాగా, లాంగ్యా హెనిపావైరస్ వైరస్ (LayV) కూడా చైనాలోనే వెలుగు చూడటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే లాంగ్యా వైరస్ మనుషులకు ఎక్కడి నుంచి సోకింది? దాని తీవ్రత ఎంత? లక్షణాలేమిటీ? వంటి వివరాలు చూద్దాం.

చైనాలో షాందాంగ్, హెనాన్ ప్రావిన్స్‌లలో ఈ వైరస్ (Langya Virus) గతంలోనే అంటే ఇంచు మించు 2018 కాలంలో డిటెక్ట్ అయింది. కానీ, గతవారమే దీన్ని అధికారికంగా కనుగొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి గొంతులో నుంచి తీసుకున్న శాంపిళ్లలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది రైతులే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు చైనాలో 35 కేసులు రిజిస్టర్ అయ్యాయి.

ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. ఎలుక జాతికి చెందిన 200 జీవుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అంటే.. ఈ లాంగ్యా వైరస్ ఈ ఎలుక జాతిలో నిలువ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ వైరస్ మేకలు, కుక్కల్లోనూ రిపోర్ట్ అయినట్టు ది గార్డియన్ పత్రిక తెలిపింది.

ఈ వైరస్ సోకిన వారిలో చాలా సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. నీరసం, దగ్గు, ఆకలి లేకపోవడం, నొప్పులు వంటి లక్షణాలు ప్రధానంగా ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తున్నాయి. కొందరిలో రక్త కణాల్లోనూ అసాధారణ సంకేతాలు కనిపించాయి. అలాగే, లివర్, కిడ్నీ దెబ్బతిన్నట్టుగా కూడా పలు కేసుల్లో డిటెక్ట్ చేశారు. 

ఈ వైరస్ తీవ్రతపైనా ఇంకా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికైతే ఇది చాలా ప్రమాదకరమైనదనే ఆలోచనలు లేవు. కానీ, శాస్త్రజ్ఞులు మాత్రం హెచ్చరిస్తున్నారు. జంతువులు, మనుషుల్లో ఈ వైరస్ తీవ్ర పరిణామాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. 40 నుంచి 75 శాతం మేరకు మరణాల రేటు ఉండొచ్చని చెప్పడం గమనార్హం. 

చైనాలో ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా చోటుచేసుకోకపోవడం ఉపశమనంగా ఉన్నది.

అలాగే, ఈ వైరస్‌కు ఇప్పటి వరకు టీకా లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios