Asianet News TeluguAsianet News Telugu

Omicron: కరోనా వేరియంట్లను పసిగట్టడంలో విఫలం అయ్యాం.. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు

కరోనా వైరస్ కొత్త వేరియంట్లు డెల్టా, ఒమిక్రాన్‌లు అభివృద్ధి చెందుతాయని అంచనా వేయడంలో తాము విఫలం అయ్యామని అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. తాము శాస్త్రజ్ఞుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నామని, కానీ, చాలా మంది శాస్త్రవేత్తలు వేరియంట్లను పసిగట్టడంలో విఫలం అయ్యారని వివరించారు. 
 

we failed in foreseeing variant of coronavirus says US vice president kamala harris
Author
New Delhi, First Published Dec 18, 2021, 6:58 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (Corona Virus) ఒక సారి ప్రళయం సృష్టించాక.. అదే వైరస్ డెల్టా రూపంలో మరోసారి పంజా విసిరింది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌ ప్రపంచ దేశాల్లో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. తొలిసారి వైరస్ విజృంభించిన సమయంలో టీకా అందుబాటులోకి రాగానే America వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టింది. ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమగ్ర శక్తిని తమ పౌరులు పొందినట్టు భావించింది. టీకా పంపిణీ రేటు పెరుగుతుండగా అదే వేగంతో ఆంక్షలు సడలిస్తూ ప్రజలు బయట తిరగడానికి అనుమతులు ఇచ్చింది. కానీ, కొత్త వేరియంట్లు(New Variants) అమెరికా స్ట్రాటజీకి గండి కొడుతున్నాయి. అయితే, కొన్ని టీకాలు వైరస్ ఉత్పరివర్తలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కొత్త వేరియంట్లు వచ్చినా గంభీరాన్ని చాటిన అమెరికా.. ఇప్పుడు దాని వైఫల్యాన్ని ఒప్పుకుంది. తాము కరోనా వేరియంట్లను అంచనా వేయడంలో విఫలం(Fail) అయ్యామని స్వయంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వెల్లడించారు.

లాస్ ఏంజెల్స్ టైమ్స్ మీడియాతో మాట్లాడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కరోనా వైరస్ వేరియంట్లు రావడాన్ని పసిగట్టలేదని అన్నారు. డెల్టా వేరియంట్ వస్తుందని తాము అంచాన వేయలేదని, ఒమిక్రాన్ వేరియంట్ వస్తుందనీ తాము ఊహించలేదని వివరించారు వైరస్‌కు ఉన్న ఇలాంటి దారుణమైన లక్షణ ఫలితమే ప్రస్తుత పరిస్థితులు అని పేర్కొన్నారు. ఈ మ్యుటేషన్లు, వేరియంట్లను ఊహించలేకపోయామని తెలిపారు. తాము శాస్త్రజ్ఞులు, నిపుణులపై ఆధారపడినా ఈ ఉపద్రవాన్ని ముందుగా పసిగట్టలేకపోయామని అన్నారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ వేరియంట్లు, మ్యుటేషన్లను తొలుత ఊహించలేదని, తాము వారి సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.

Also Read: మహారాష్ట్రలో మళ్లీ కరోనా అలజడి.. ఒకే స్కూల్‌లో 16 మందికి పాజిటివ్, ఉలిక్కిపడ్డ అధికారులు

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్‌లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం న్యూయార్క్‌లో 21,027 కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త కేసులను పెంచుతున్నది. కరోనా టీకా వేసుకోని వారు ఈ శీతాకాలంలో తీవ్ర ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉన్నదని ప్రెసిడెంట్ జో బైడెన్ ఇటీవలే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

జనవరి 8 కల్లా 40వేల మరణాలు
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ కరోనా మరణాలు పెరిగే ముప్పు ఉన్నదని అంచనా వేసింది. కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతాయని వివరించింది. జనవరి 8వ తేదీ కల్లా దేశంలో సుమారు 40వేల మరణాలు చోటుచేసుకునే ముప్పు ఉన్నదని వివరించింది. కాగా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంతటి ప్రమాదకారినో తేల్చడానికి శాస్త్రజ్ఞులు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ వేరియంట్ టీకా శక్తిని అధిగమిస్తుందని, డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని తెలుస్తున్నది.

Also Read: ఒమిక్రాన్ వేరియంట్‌ను స్పుత్నిక్ వీ సమర్థంగా ఎదుర్కొంటుంది.. రష్యా ప్రభుత్వం

ఒమిక్రాన్ వేరియంట్‌ను నాశనం చేసే సామర్థ్యం గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో తయారు చేసిన టీకాలు సహా ఇతర అన్ని టీకాల కంటే మూడు నుంచి ఏడు రెట్లు అధిక సామర్థ్యం స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని వివరించింది. కాగా, స్పుత్నిక్ వీ లైట్ వెర్షన్ టీకా 80 ఎఫికసీని ప్రదర్శించినట్టు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios