Asianet News TeluguAsianet News Telugu

ఒమిక్రాన్ వేరియంట్‌ను స్పుత్నిక్ వీ సమర్థంగా ఎదుర్కొంటుంది.. రష్యా ప్రభుత్వం

ఒమిక్రాన్ వేరియంట్‌ను స్పుత్నిక్ వీ టీకా సమర్థంగా ఎదుర్కొంటున్నదని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. ఇతర టీకాల కంటే స్పుత్నిక్ వీ టీకా మెరుగైన ఫలితాలను చూపిస్తున్నదని ఓ ప్రకటనలో తెలిపింది. బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్ కూడా మెరుగ్గా పని చేస్తున్నదని వివరించింది. బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్‌ను మళ్లీ వ్యాక్సినేట్ చేసిన 100 మందిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ పూర్తిగా నాశనం అయిందని పేర్కొంది.
 

sputnik v effective against omicron variant
Author
New Delhi, First Published Dec 17, 2021, 7:37 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) ప్రపంచవ్యాప్తంగా పంజా విసిరేందుకు సిద్ధమవుతుంటే.. దాన్ని ఎదుర్కొనే ఆయుధాలను అన్వేషించడంలో నిపుణులు మునిగిపోయారు. ఈ వేరియంట్‌పై టీకాల సమర్థత ఏమిటనే విషయంపై ఎడతెగని చర్చ జరుగుతూనే ఉన్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుత టీకాలు ఉత్పన్నం చేసే రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, ఇంకొందరు కొన్ని టీకాలు కొత్త వేరియంట్‌పై పని చేస్తాయని పేర్కొంటున్నారు. ఆ టీకా సామర్థ్యం కొంత సన్నగిల్లినా.. కొత్త వేరియంట్‌ను ఎదుర్కోగలవని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా(Russia) ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఆ దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ(Sputnik V) టీకా ఒమిక్రాన్ వేరియంట్‌ను ప్రభావవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించింది.

ఒమిక్రాన్ వేరియంట్‌ను నాశనం చేసే సామర్థ్యం గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో తయారు చేసిన టీకాలు సహా ఇతర అన్ని టీకాల కంటే మూడు నుంచి ఏడు రెట్లు అధిక సామర్థ్యం స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని వివరించింది. కాగా, స్పుత్నిక్ వీ లైట్ వెర్షన్ టీకా 80 ఎఫికసీని ప్రదర్శించినట్టు తెలిపింది. బలమైన, దీర్ఘకాలం పని చేసే టీ సెల్స్ ప్రతిస్పందనను కలిగించే శక్తి స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్‌లోని ఉత్పరివర్తనాలు టీ సెల్స్‌లోని 80 శాతం ఎపిటోప్స్‌ను ఏమీ చేయలేకపోయాయని తెలిపింది.

Also Read: Omicron: ఇండియాలో సెంచరీ దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో నమోదు.. అనవసర ప్రయాణాలు వద్దు: కేంద్రం

కాగా, స్పుత్నిక్ లైట్ వెర్షన్ టీకా బూస్టర్‌గా మెరుగైన ఫలితాలను ఇచ్చిందని రష్యా ప్రభుత్వం తెలిపింది. స్పుత్నిక్ లైట్ బూస్టర్‌గా వేసుకున్నాక రెండు మూడు నెలల తర్వాత ఒమిక్రాన్ వేరియంట్‌ను సమర్థవంతంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో తేలిందని వివరించింది. ఇలా స్పుత్నిక్ లైట్ టీకా బూస్టర్‌గా రెండో సారి వేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. స్పుత్నిక్ లైట్‌తో పోల్చితే ఫైజర్‌ టీకా 25 శాతం మాత్రమే ప్రభావాన్ని చూపెట్టిందని వివరించింది.

కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) కేసులు దేశంలో పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సెంచరీ దాటి 101 నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్(Lav Agarwal) వెల్లడించారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 32 ఒమిక్రాన్ కేసులు, ఢిల్లీలో 22 కేసులు, రాజస్తాన్‌లో 17 కేసులు, కర్ణాటక, తెలంగాణల్లో ఎనిమిదేసి కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు గుజరాత్, కేరళలలో ఐదేసి ఒమిక్రాన్ కేసులు, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌, చండీగడ్‌లలో ఒక్కో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్టు తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం 91 దేశాల్లో రిపోర్ట్ అయిందని లవ్ అగర్వాల్ వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తున్నదని అన్నారు. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం డెల్టా కంటే.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయని చెప్పారు. ఒకవేళ కమ్యూనిటీ స్థాయి వ్యాప్తి జరిగితే ఏ దేశంలోనైనా డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ వేరియంట్ అధిగమించి వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. అయితే, టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోలేవని చెప్పడానికి ఆధారాలేవీ లేవని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios