‘హమాస్‌కు ఎలాంటి గతి పడుతున్నదో చూడండి’.. లెబనాన్ నుంచి దాడి చేస్తున్న హెజ్బోల్లాకు ఇజ్రాయెల్ వార్నింగ్
తమ పై దాడి చేసిన హమాస్‌కు ఎలాంటి గతి పడుతున్నదో చూడండి.. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పై దాడులు చేసిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్ ఇది. హమాస్‌తో యుద్ధం ముదిరితే.. హెజ్బొల్లా నుంచీ దాడి తీవ్రతరం అవుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నది.
న్యూఢిల్లీ: ఒక వైపు ఇజ్రాయెల్ గాజా పట్టిలోని హమాస్ పై భూతల దాడికి సిద్ధం అవుతుండగా.. మరోవైపు లెబనాన్ సరిహద్దు నుంచి హెజ్బొల్లా దాడిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇజ్రాయెల్‌కు ఉత్తరం వైపున ఉండే లెబనాన్ దేశం నుంచి షియా మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా నుంచి బాంబులు ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా వచ్చాయి. దీంతో ఇజ్రాయెల్ వెంటనే ప్రతిదాడికి పాల్పడింది. అయితే.. అంతకు క్రితం రోజు ఇజ్రాయెల్ తమపై దాడి చేసిందని, అందులో రాయిటర్స్ కెమెరామెన్ సహా మరొకరు మరణించారని, అందుకే తాము దాడి చేయాల్సి వచ్చిందని హెజ్బొల్లా పేర్కొంది.
ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా దాడులు చేసింది. ఇజ్రాయెల్ కూడా హెజ్బొల్లాపై దాడి చేసింది. లెబనాన్ సరిహద్దు నుంచి కనీసం 4 కిలోమీటర్ల దూరానికి వెళ్లాలని ఇజ్రాయెల్ ఆ దేశ పౌరులకు సూచనలు చేసింది. లెబనాన్ సరిహద్దును క్లోజ్డ్ మిలిటరీ జోన్‌గా ప్రకటించింది. అదే విధంగా హెజ్బొల్లాకు ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. హమాస్‌కు ఏం జరుగుతున్నదో చూడండి అంటూ హెచ్చరించింది. హమాస్‌తో యుద్ధం ముదిరితే.. హెజ్బొల్లా నుంచీ దాడి తీవ్రతరం అవుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నది.
Also Read: గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తే.. తర్వాతి పరిణామాలను ఎవరూ కంట్రోల్ చేయలేరు: ఇరాన్ వార్నింగ్
ఏబీసీ న్యూస్‌కు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి పీటర్ లెర్నెర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. ‘ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మేం 3,00,000 లక్షల మంది రిజర్విస్టులను రిక్రూట్ చేసుకున్నాం. వీరిని గాజా వైపు దక్షిణాదిగా, మరికొందరిని లెబనన్ సరిహద్దు వైపు ఉత్తరాదిగా పంపించాం. హెజ్బొల్లా నుంచీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నందున ఇక్కడికి కూడా ఫోర్స్ పంపించాం’ అని చెప్పారు.
‘మేం తరుచూ ఈ సరిహద్దు నుంచి దాడులను ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భంగా నేను హెజ్బొల్లాకు ఒక బలమైన సూచన చేయాలని భావిస్తున్నాను. గాజాలో హమాస్‌కు ఏం జరుగుతున్నదో చూడండి. మేం మా దేశ రక్షణ కోసం కట్టుబడి ఉన్నాం’ అని వార్నింగ్ ఇచ్చారు.