గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తే.. తర్వాతి పరిణామాలను ఎవరూ కంట్రోల్ చేయలేరు: ఇరాన్ వార్నింగ్
ఒక వేళ ఇజ్రాయెల్ గాజాను ఆక్రమిస్తే మాత్రం తర్వాతి పరిణామాలను ఎవరూ కంట్రోల్ చేయలేరని, ఆ కల్లోలం మరింత విస్తరించకుండా ఆపనూ లేరని ఇరాన్ మంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న అమెరికాపైనా విమర్శలు చేశారు.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ వార్ మోడ్‌లోనే ఉన్నది. హమాస్‌ను లక్ష్యంగా ఇప్పటికే గగనతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ భూతల దాడికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే సరిహద్దు వైపుగా పెద్ద మొత్తంలో సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించి ఉన్నది. పాలస్తీనియన్లు దక్షిణం వైపుగా వెళ్లిపోవాలని ఇది వరకే ఇజ్రాయెల్ ఆదేశించింది. సేఫ్ కారిడార్‌కు కూడా సమయం ముగిసిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నది. అది ఏ క్షణంలోనైనా గాజాపై విరుచుకుపడే ముప్పు ఉన్నది. దీనికితోడు ఇజ్రాయెల్ పొరుగు దేశం లెబనాన్ నుంచి కూడా హెచ్చరికలను ఎదుర్కొంటున్నది. షియా మిలిటెంట్ గ్రూప్ హెజ్బోల్లా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. హెజ్బొల్లా గ్రూపు, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య చిన్న మొత్తంలో దాడులు జరిగాయి కూడా.
ఈ సందర్భంలోనే ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్న సమయంలో ఒక వేళ గాజా ఆక్రమణ జరిగితే తదుపరి పరిణామాలను ఎవరూ కంట్రోల్ చేయలేరని హెచ్చరించింది. ఆ తర్వాత ఎవరూ పరిస్థితులను నియంత్రించలేరని, ఆ కల్లోలం మరింత విస్తరించకుండా ఆపలేరని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిర్ అబ్దొల్లాహియన్ ఖతర్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల థానీతో సమావేశమయ్యాక ఈ ప్రకటన వచ్చింది.
యుద్ధం జరగకుండా, ఈ సంక్షోభాన్ని మరింత దిగజారకుండా ఆపాలని భావిస్తున్నవారు వెంటనే గాజాలోని పౌరులపై జరుగుతున్న ఈ ఆటవిక దాడులను అడ్డుకోవాలని ఇరాన్ మంత్రి సూచించారు.
ఇజ్రాయెల్‌కు మొదటి నుంచి వత్తాసు పలుకుతున్న అమెరికా పైనా ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
Also Read: ‘సమతా మూర్తి’: అమెరికా రాజధానిలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఇరాన్ మంత్రి ఆదివారం ఖతర్ పర్యటించగా, తర్వాతి ఇరాక్, లెబనాన్, సిరియాల్లోనూ పర్యటించబోతున్నారు.