శుక్రవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మన సౌర వ్యవస్థలోని ప్రకాశవంతమైన గ్రహాలైన శుక్రుడు, బృహస్పతిలు చంద్రుడికి దగ్గరగా వచ్చారు. చంద్రుని చీకటి అంచు వెనుక శుక్రుడు వుండగా.. అనంతరం మిణుకు మిణుకు మంటూ అదృశ్యమయ్యాడు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన శుభవేళ.. శుక్రవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మన సౌర వ్యవస్థలోని ప్రకాశవంతమైన గ్రహాలైన శుక్రుడు, బృహస్పతిలు చంద్రుడికి దగ్గరగా వచ్చారు. శుక్రవారం సాయంత్రం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ సుందర దృశ్యం కనిపించింది. దీనిని వీక్షించిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రుని చీకటి అంచు వెనుక శుక్రుడు వుండగా.. అనంతరం మిణుకు మిణుకు మంటూ అదృశ్యమయ్యాడు. చూపరులను ఈ దృశ్యం ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రుడు తన ప్రకాశంతో శుక్రుని వెలుగును దాదాపు 250 రెట్లు పెంచాడు. చంద్రుని శరీరం ప్రస్తుతం అమావాస్య దశలో వుంది. ఉపరితలంలో కేవలం 9 శాతం మాత్రమే కనిపించింది. ఇలాంటి దశను వాక్సింగ్ క్రెసెంట్ అని అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడు, భూమి, చంద్రునికి ఎదురుగా వున్నప్పుడు ఈ వాక్సింగ్ క్రెసెంట్ దశ ప్రారంభమవుతుందని వారు తెలిపారు.
అయితే వచ్చే కొద్దిరోజుల్లో మరో సుందర దృశ్యం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. మార్చి చివరిలో ఆకాశంలో ఐదు గ్రహాలు కనివిందు చేయనున్నాయి. మార్చి 28న రాత్రి ఐదు గ్రహాలు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పది, యురేనస్‌లు ఒకే వరుసలో కనిపించనున్నాయి. ఇవి దాదాపు 50 డిగ్రీ సెక్టార్‌లు ప్రకాశించనున్నాయి. అయితే బుధుడు, బృహస్పతిని హోరిజోన్ వద్ద గమనించవచ్చు, కానీ యురేనస్‌ను గుర్తించడం కొంచెం కష్టమే.
భూమి నుంచి వీటిని చూసినప్పుడు ఇవి ఆర్చ్ ఆకారంలో కనిపిస్తాయి. ప్రత్యేక పరికరాలు లేకుండానే వీటిని చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ యురేనస్‌ను చూడాలంటే మాత్రం బైనాక్యులర్స్ అవసరం. మార్చి 28న ఖగోళంలో చోటు చేసుకునే ఈ దృశ్యాన్ని లార్జ్ ప్లానెటరీ ఆలైన్‌మెంట్ అంటారు. ఈ ఐదు గ్రహాలు సూర్యుడికి ఓ వైపు నుంచి అతి సమీపంలో వుంటాయి. ఇలాంటి అద్భుతం గతేడాది జూన్‌లో చోటు చేసుకుంది.
