వార్నీ.. కలలో ఉన్నాననుకుని.. గాల్లో ఉండగానే విమానం ఇంజిన్ ఆపేయబోయాడు...
విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఆపడానికి ప్రయత్నించిన ఓ పైలెట్ తాను ఆ సమయంలో నిద్రలో ఉన్నాననుకున్నాడట.
లాస్ ఏంజిల్స్ : విమానం ఆకాశంలో ఉండగా ఇంజిన్ ఆపడానికి ప్రయత్నించాడో పైలెట్. దీనిమీద ఆ పైలెట్ వివరణ ఇస్తూ తాను ఆ సమయంలో కలలో ఉన్నానని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఆఫ్-డ్యూటీ యుఎస్ పైలట్ జోసెఫ్ ఎమర్సన్ (44) మ్యాజిక్ పుట్టగొడుగులను తిన్నాడని, నాడీ బలహీనత ఉందని.. దానివల్లే ఈ పొరపాటు జరిగిందని సమర్పించిన కోర్టు పత్రాలు మంగళవారం వెలుగు చూశాయి.
40 గంటల్లో తాను నిద్రపోలేదని పోలీసులకు తెలిపిన ఎమర్సన్, విమానం వెనుక భాగంలో ఉన్న ఎమర్జెన్సీ తలుపులు కూడా తెరవడానికి ప్రయత్నించాడు. అయితే, అది తెరుచుకోలేదు. ఈ ప్రయత్నాలతో అప్రమత్తమైన మిగతా పైలెట్ అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఈ సమయంలో క్యాబిన్ సిబ్బంది అతని చర్యలను నిరోధించవలసి వచ్చింది.
Alaska Airlines: విమానం గాల్లో ఉండగానే ఇంజన్ ఆఫ్.. మరో పైలట్ అప్రమత్తం.. 80 మంది సేఫ్..
"నేను ఎమర్జెన్సీ షట్‌ఆఫ్ హ్యాండిల్స్ రెండింటినీ తీసేసాను. ఆ సమయంలో నేను కల కంటున్నాననుకున్నాను. నేను నిద్రలేవాలనుకున్నాను’’ అని ఎమర్సన్ పోలీసులకు చెప్పాడు,
ఎమర్సన్ దర్యాప్తు అధికారి "మ్యాజిక్ పుట్టగొడుగులను తినడం గురించి మాట్లాడారు. ఎమర్సన్ ఆ పుట్టగొడుగులను తినడం ఇదే మొదటిసారి అని చెప్పాడు". అలస్కా ఎయిర్‌లైన్స్ విమానం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత 44 ఏళ్ల వ్యక్తిని ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు.
ఆఫ్ డ్యూటీ సిబ్బంది కోసం ఎయిర్‌లైన్ పాలసీలో భాగంగా ఉన్న కాక్‌పిట్ జంప్ సీట్‌లో కూర్చున్నాడు ఎమర్సన్. హారిజన్ ఎయిర్ నడుపుతున్న ఈ విమానం ఎవరెట్, వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో మధ్య నడుస్తోంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి, పైలట్‌లతో చాట్ చేసిన తర్వాత "ఎమర్సన్ విమానం అత్యవసర అగ్నిమాపక వ్యవస్థకు సంబంధించిన.. విమానం ఇంజిన్‌లకు ఇంధనాన్ని నిలిపివేసే రెండు ఎరుపు ఫైర్ హ్యాండిల్స్‌ను పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు" అని న్యాయ శాఖ తెలిపింది.
"పైలట్‌లతో కొద్దిసేపు శారీరక పోరాటం తర్వాత, ఎమర్సన్ కాక్‌పిట్ నుండి బైటికి వెళ్లాడు" హ్యాండిల్స్‌ను రివర్స్ చేయడానికి పైలట్లు వెంటనే స్పందించారని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అలస్కా ఎయిర్‌లైన్స్ సోమవారం తెలిపింది. "ఫ్లైట్ అటెండెంట్లు ఎమర్సన్‌ను నియంత్రణలో ఉంచారు.అతనిని విమానం వెనుక భాగంలో కూర్చోబెట్టారు" అని న్యాయ శాఖ తెలిపింది.
"ఫ్లైట్ దిగే సమయంలో, ఎమర్సన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ హ్యాండిల్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఒక ఫ్లైట్ అటెండెంట్ తన చేతులను అడ్డుపెట్టి ఆపింది." ఫ్లైట్ సిబ్బంది, సహాయకులతో జోక్యం చేసుకున్నందుకు ఎమర్సన్ ఫెడరల్ అభియోగాన్ని ఎదుర్కొంటున్నారని ఒరెగాన్ జిల్లాకు సంబంధించిన యూఎస్ అటార్నీ కార్యాలయం తెలిపింది.
ఎమర్సన్ "నిరవధికంగా సేవ నుండి తొలగించబడ్డాడు. అన్ని విధుల నుండి అతడిని తొలగించాం" అని అలస్కా ఎయిర్‌లైన్స్ మంగళవారం తెలిపింది.