అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. యూఎస్ మిలటరీకి చెందిన ఈ ఛాపర్ అలబామాలోని హంట్స్‌విల్లే సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో యూఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. అలబామాలోని హంట్స్‌విల్లే సమీపంలోని హైవే 53పై బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మాడిసన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం స్పందిస్తూ.. అలబామాలోని హంట్స్‌విల్లే సమీపంలోని బర్వెల్ రోడ్, నేషనల్ హైవే-53లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రకటించింది. ఇద్దరు మృతి చెందారని పేర్కొంది.
పుగైలాయిపట్టిలో ఘనంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం.. 23 మందికి గాయాలు
ప్రమాదం తర్వాత హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు హంట్స్‌విల్లే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ తెలిపింది. ప్రమాదం కారణంగా కార్లకు, పాదచారులకు ఎలాంటి గాయాలు కాలేదని ఫాక్స్ న్యూస్ డిజిటల్ ధృవీకరించింది. ఆ హెలికాప్టర్ యూఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ అని మాడిసన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. అయితే ఈ హెలికాప్టర్‌లో ఎంత మంది ఉన్నారనేది ఇప్పటి వరకు వెల్లడించలేదు. హెలికాప్టర్ టేనస్సీ నేషనల్ గార్డ్‌కు చెందినదని, ఇది శిక్షణలో ఉండగా ప్రమాదం చోటు చేసుకుందని టేనస్సీ నేషనల్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘ ఈ ప్రమాదంలో ఇద్దరు టేనస్సీ నేషనల్ గార్డ్స్‌మెన్‌లను కోల్పొయినందుకు చాలా బాధపడ్డాం. ఈ హృదయ విదారక విషాదంలో మా ప్రార్థనలు వారి కుటుంబాలతో ఉన్నాయి’’ అని టేనస్సీ సైనిక దళాల అధిపతి బ్రిగేడియర్ జనరల్ వార్నర్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో ఇతర సర్వీస్ సభ్యులు, పౌరులు ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.
ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి ఆత్మహత్య కేసు.. ఘాతుకానికి ముందు అరగంట తండ్రితో మాట్లాడిన దర్శన్ సోలంకి
కాగా.. గత ఏడాది జూలైలో మెక్సికోలోని సినాలోవాలో బ్లాక్ హాక్ ప్రమాదంలో 14 మంది మరణించారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో 15 మంది ఉన్నారు. మెక్సికన్ డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరో అరెస్ట్ అయిన వెంటనే ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. ఎఫ్ బీఐ 10 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో రాఫెల్ కారో క్వింటెరో ఒకరు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి, క్వింటెరో అరెస్టుకు మధ్య ఏదైనా సంబంధం ఉందని నావికాదళం ధృవీకరించలేదు.
జనవరి 2వ తేదీన కూడా ఆస్ట్రేలియాలో ఓ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇందులో ఎలాంటి ప్రాణనష్టమూ జరగకపోయినా..పలువురికి గాయాలు అయ్యాయి. క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లోని మెయిన్ బీచ్ సమీపంలో రెండు హెలిక్యాప్టర్ ఒక దానినొకటి ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘర్షణ వల్ల హెలికాప్టర్ శిథిలాలు బీచ్ లోని ఇసుకపై పడిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది.
