అమెరికాలో F, M, J వీసాల ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేత, గైర్హాజరీపై వీసా రద్దు హెచ్చరికతో విద్యార్థుల్లో ఆందోళన.
అమెరికాలో చదువుకోవాలనుకున్న విదేశీ విద్యార్థులకు ఒక పెద్ద శాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, విద్యార్థుల వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా F, M, J వీసాల కోసం కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పటికే ఇంటర్వ్యూకు అప్పాయింట్‌మెంట్ తీసుకున్నవారికి ఈ ఆంక్షలు వర్తించవు.
ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి మార్క్ రూబియో అమెరికాలోని కాన్సులేట్‌లకు స్పష్టం చేశారు. విద్యార్థుల వీసాల జారీపై మరింత నిఘా పెట్టాల్సిందిగా సూచించారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఈ కొత్త మార్గదర్శకాలను గమనించాల్సిన అవసరం ఉంది.
తరగతులకు గైర్హాజరైన..
గత కొన్ని రోజులుగా విద్యార్థుల హాజరుపై, తరగతుల్లో పాల్గొనడం పై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా స్పందిస్తోంది. తరగతులకు గైర్హాజరైన విద్యార్థులు లేదా మధ్యలో చదువును విరమించినవారి వీసాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ప్రభావంగా, భవిష్యత్తులో అమెరికా వీసా దరఖాస్తు చేసే హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
విద్యార్థుల హోదాలో ఉన్నవారు తరగతులకు పంక్చువల్గా హాజరవుతూనే ఉండాలి. చదువును మానేయాలనుకుంటే లేదా ఏదైనా కారణం ఉంటే, వెంటనే తమ కళాశాలలతో సంబంధం పెట్టుకొని అధికారికంగా సమాచారం ఇవ్వాలని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అలాగేయాక తప్ప వీసా రద్దు తప్పదని పేర్కొంది.
ఇప్పటికే కొన్ని సందర్భాల్లో, ముందస్తు సమాచారం లేకుండానే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు వివిధ కారణాలు చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ప్రొటెస్టుల వల్ల, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల కూడా వీసా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ విద్యార్థుల్లో భయం, అయోమయం నెలకొంది. చదువు కోసమనే ఉద్దేశంతో అమెరికా వెళ్లిన వారికీ చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల అమెరికాలో చదువుకునే భారతీయులు సహా ఇతర దేశాల విద్యార్థులు తమ వీసా నిబంధనలపై పూర్తి అవగాహనతో ఉండాలని, హోదాలో ఎలాంటి తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.